PAILAN PARK : సర్వాంగ సుందరంగా చౌటుప్పల్ ఫైలాన్

PAILAN PARK : సర్వాంగ సుందరంగా చౌటుప్పల్ ఫైలాన్

శరవేగంగా పైలాన్ పార్క్ అభివృద్ధి పనులు

సర్వత్ర హర్షతిరేకాలు వ్యక్తం

ప్రారంభానికి సిద్ధం

చౌటుప్పల్, మనసాక్షి :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2015 లో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకానికి చిహ్నంగా, హైదరాబాదుకు అతి సమీపములో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పక్కన సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పైలాన్ పార్క్ ఎట్టకేలకు సర్వాంగ సుందరంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఆహ్లాదాన్ని పంచడానికి ముస్తాబయింది.

చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రం ఏర్పడిన తర్వాత పైలాన్ పార్క్ అందరికీ ఆహ్లాదాన్ని పంచడానికి అన్ని హంగులు పూర్తిచేసుకుని ఏర్పాటుకు సిద్ధమవుతుండడంతో సర్వత్ర పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చౌటుప్పల్ నడిబొడ్డున జాతీయ రహదారి పక్కన ఇప్పుడు మిషన్ భగీరథ పథకానికి చిహ్నమైన పైలాన్ పార్కు కొత్త కళను సంతరించుకుంది.

 50 లక్షల పురపాలక నిధులతో….

ఒకప్పుడు కళావిహనంగా మారిన పైలాన్ పార్కు, చౌటుప్పల్ పురపాలక కేంద్రం నడిబొడ్డున సరికొత్తగా సర్వహంగులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మున్సిపాలిటీకి విడుదల చేసిన 50 లక్షల పురపాలక నిధులతో పచ్చని చెట్లు, ఆటవిడుపు పరికరాలు, చూడ చక్కని బొమ్మలతో సర్వాంగ సుందరంగా మారుతుంది. అందమైన ఉద్యానవనంగా , కళాఖండాలతో పిల్లలకు, పెద్దలకు ఉదయం, సాయంత్రం వేళలో ఆహ్లాదం పంచడానికి సిద్ధమవుతుంది.

అభివృద్ధి పనులకు ప్రాణం పోసుకొని శరవేగంగా ముస్తాబవుతూ త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. పార్కులో పచ్చని మైదానం, రకరకాల పూల మొక్కలతో ఫైలన్ పార్కు త్వరలో సందర్శకులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతుండడంతో చౌటుప్పల్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి మంగళవారం పైలాన్ పార్కును సందర్శించి ఇక్కడ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.పనులను వేగవంతం చేయాలని సూచించారు.

పిల్లల ఆటవిడుపు కోసం….

పైలాన్ పార్కులో పసి హృదయాలను కట్టిపడేసే విధంగా ఆట వస్తువులు, జీవం ఉట్టిపడేలా ఉన్న నెమలి, పులి, జింకలు, జిరాఫీ, తాబేలు, మోసలి, ఏనుగు, కొంగలు,నీటి కొలను వంటి బొమ్మలతో పార్కు చుట్టూ చూపరులను కనులు తిప్పుకోకుండా కట్టిపడేసే విధంగా అక్కడక్కడ అందంగా ఏర్పాటు చేశారు.

పిల్లలు, పెద్దలు సేద తీరడానికి పండ్ల ఆకారంలో ఉన్న ఆసనాలను కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాల ఆట వస్తువులను ఏర్పాటు చేశారు .సకల సౌకర్యాలతో సందర్శకులను ఆకర్షించేలా పార్కు ముస్తాబవుతూ, తుది మెరుగులు దిద్దుకుంటుంది. పైలాన్ పార్క్ సుందరీకరణ పూర్తి అయితే సందర్శకులు తాకిడి పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

By

Thirumalagiri Venkateshwarlu

MANASAKSHI