హైదరాబాదు : విజయవాడ ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్

హైదరాబాదు : విజయవాడ ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్

హైదరాబాద్ , మనసాక్షి :

హైదరాబాద్ నుండి విజయవాడకు, విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఈ – గరుడ బస్సులను అత్యాధునిక సౌకర్యాలతో ప్రారంభించింది.

 

ఈ బస్సులలో ప్రీమియం సౌకర్యాలు ఉన్నాయి దాంతోపాటు కేవలం ఐదు గంటల వ్యవధిలోనే గమ్యస్థానానికి చేర్చనున్నాయి. ఇటీవల హైదరాబాద్ – విజయవాడ వెళ్లే వారికి పది బస్సులను ప్రారంభించిన విషయం తెలిసిందే.

 

హైదరాబాద్ – విజయవాడ కు 10 ఎలక్ట్రిక్ గరుడ బస్సులను ప్రారంభించారు. కాగా త్వరలో హైదరాబాద్ – విజయవాడ రూట్ లో 50 ఈ – గరుడ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

 

హైదరాబాద్ విజయవాడ మధ్య రోజుకు 50 వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. వారి కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ గరుడ బస్సులను నడిపేందుకు టీఎస్ ఆర్టీసీ ముందుకు వచ్చింది. మరింత సౌకర్యంగా ఉండేందుకుగాను 20 నిమిషాలకు ఒక గరుడ బస్సు నడిపే విధంగా ఏర్పాట్లు చేశారు.

 

ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ రోడ్ లో 10 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన అధికారులు. ఈ ఏడాదిలోగా 50 బస్సులను నడపనున్నారు. ఈ బస్సులను ఎంజీబీఎస్ నుంచి, మియాపూర్ నుంచి జేబీఎస్ మీదుగా నడుపుతున్నారు.

కేవలం హైదరాబాద్ – విజయవాడ రూట్ లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రెండు సంవత్సరాల కాలంలో 1860 ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటిలో మొట్టమొదటిగా హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నారు.

 

త్వరలో నగరంలో 10 డబుల్ డెక్కర్, 550 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వీసి సజ్జనార్ ఎలక్ట్రిక్ గరుడ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా పేర్కొన్నారు. దాంతో త్వరలో నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి.