తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయంవ్యవసాయం

Komatireddy Venkatreddy : రైతులకు గుడ్ న్యూస్.. మూడు రోజుల్లోనే వారి ఖాతాలలో డబ్బులు జమ..!

Komatireddy Venkatreddy : రైతులకు గుడ్ న్యూస్.. మూడు రోజుల్లోనే వారి ఖాతాలలో డబ్బులు జమ..!

నల్లగొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాల బావి వద్ద ఏర్పాటు చేసిన రాష్ట్రంలోనే మొదటి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో గత సీజన్లో సైతం దాన్యం కొన్న 3 రోజుల్లోనే రైతులకు చెల్లింపులు చేయడం జరిగిందని గుర్తు చేశారు.

వానకాలం ధాన్యానికి సంబంధించి రైతులకు ఏవైనా ఇబ్బందులు ఏర్పడిన లేదా చెల్లింపులు ఆలస్యమైన జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9963407064 నెంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రత్యేకించి సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ సైతం ఇస్తున్నదని ,గ్రేడ్ -ఏ దాన్యానికి క్వింటాలుకు 2320 /- రూపాయల మద్దతు ధర , సాధారణ రకానికి 2320/- రూపాయలు ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించిందని, రాష్ట్రంలో 53% సన్నాలు పండుతున్నాయని, ధనవంతులతో పాటు, పేదలు సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో వచ్చే జనవరి నుండి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినందున సన్నాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

మిల్లర్లు సన్న బియ్యంతో పాటు, దొడ్డు రకానికి సైతం ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా దొడ్డు ధాన్యాన్ని తీసుకోవాలని అన్నారు. తెలంగాణలో సన్నధాన్యానికి 500 /-రూపాయల బోనస్ ప్రకటించినందున పక్క రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా అధికారులు ముందు జాగ్రత్త తీసుకోవాలని అన్నారు.

తమ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని, ఒకేసారి రాష్ట్రంలోని 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రుణాలు రుణమాఫీ చేయడం జరిగిందని రెండు లక్షల కన్నా ఎక్కువ ఉన్న వారి రుణాలను వారం పది రోజుల్లో రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి వేల్లడించారు.

దీంతో పాటు పేదలకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వనున్నామని, 500 రూపాయలకే ఎల్పీజీ కనెక్షన్ ఇస్తున్నామని తెలిపారు. ఎస్ ఎల్ బి సి ఇంజన్ పాడైతే అమెరికా నుండి దానికి సంబంధించిన విడిభాగాన్ని తెప్పించడం జరిగిందని, డిసెంబర్లో పనులు మొదలుపెట్టి రెండేళ్లలో సొరంగం పనులు పూర్తి చేస్తామన్నారు.

అన్ని కులాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని 200 కోట్లు రూపాయలతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లను కట్టిస్తున్నామని, మొదటి విడత 20 నియోజకవర్గాలలో ఈనెల 11న పనులు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా జిల్లాలోని అన్ని చెరువులకు సాగునీటి అందించడంలో భాగంగా 12 మిషన్లను ఏర్పాటు చేసి తన సొంత నిధులు 80 లక్షల ఖర్చుతో డిస్ట్రిబ్యూటరీలలో పూడికతీత, చెట్ల తొలగింపును చేపట్టడం జరిగిందని తెలిపారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లో 70000 ఉద్యోగాలు ఇచ్చామని, బుధవారం 11,000 మంది డిఎస్సి ద్వారా ఎంపికైన టీచర్లకు నియామక పత్రాలు అందజేస్తున్నట్లు. చెప్పారు. బ్రాహ్మణ వెల్లేముల ద్వారా డిసెంబర్లో చెరువులు నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని,ఇందుకు 25 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలోని యంత్రాంగం 15 రోజులు కష్టపడి పనిచేసి దాన్యాన్ని కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని చెప్పారు.

అధనపు కలెక్టర్ జె .శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ వాన కాలంలో జిల్లాలో 7 లక్షల 50000 మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని అంచన వేసినట్టు తెలిపారు. ఇందుకు గాను 375 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, రైతులు నాణ్యత ప్రమాణాలకు తగ్గకుండా ధాన్యాన్ని తీసుకురావాలని, తేమ 17% మించకుండా చూడాలన్నారు.

ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా నియంత్రించడంలో భాగంగా వాడపల్లి, నాగార్జున సాగర్ లో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశామని, సన్నధాన్యం, దొడ్డు ధాన్యానికి వేరువేరుగా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రైతులు ధాన్యం అమ్మిన డబ్బులు వెంటనే పొందేందుకు కొనుగోలు కేంద్రం వద్దనే పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీ తీసుకురావాలన్నారు.

ఈ కార్యక్రమానికి సింగిల్ విండో అధ్యక్షులు నాగరత్నం రాజు అధ్యక్షత వహించగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి , జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడారు. జిల్లా పౌరసరఫరాల మేనేజర్ హరీష్, వ్యవసాయ శాఖ జెడి శ్రవణ్, మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ , తిప్పర్తి, నల్గొండ మాజీ జెడ్పిటిసిలు రామిరెడ్డి ,లక్ష్మయ్య, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు హాజరయ్యారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు