District collector : ధాన్యం కొనుగోలులో నిబంధనలు పాటించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District collector : ధాన్యం కొనుగోలులో నిబంధనలు పాటించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వరి ధాన్యం (సన్న రకం) కొనుగోలుకు సంబంధించి క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని, సన్నాలకు బదులు దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంస్థ ఆధ్వర్యంలో రబీ 2024-25 కు గాను వరి ధాన్యం కొనుగోలు పై గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపుదారి వద్ద గల వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సంబంధిత శాఖల అధికారులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లా రైతాంగానికి లబ్ధి చేకూర్చాలని ఆమె సూచించారు. కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో, రూల్స్, గైడ్ లైన్స్ ను అందరూ అమలు చేయాలన్నారు.
ఇది సీఎం జిల్లా అని, అధికారులంతా సమన్వయంతో పని చేసి కొనుగోళ్లలో నారాయణపేట జిల్లాకు మంచి పేరు తీసుకు రావాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో సన్న రకం వడ్లు దొడ్డు రకం వడ్లు వేర్వేరు కౌంటర్లలో కొనుగోలు చేసి, వేరు వేరు రిజిస్టర్ లలో నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వం కొన్ని కోట్ల నిధులను కేటాయించి రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తోందని,
ఈ విషయంలో అధికారులు చాలా జాగ్రత్తగా పనిచేయాలని ఆదేశించారు. వెంటనే జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన ఫ్లెక్సీలు, తేమను కోలుచే యంత్రాలు, రిజిస్టర్లు, ముఖ్యంగా ట్యాబ్ లను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
కేంద్రంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా గైడ్ లైన్స్ ప్రకారం వడ్లను కొనుగోలు చేయాలని ఆమె పునరుద్ఘాటించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి చాలా సమస్యలు ఉంటాయని,కానీ వాటన్నింటినీ సమన్వయంతో పరిష్కరించుకుంటూ జిల్లా రైతాంగానికి మనం మేలు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. గత సంవత్సరం ట్రాన్స్ పోర్ట్ పరంగా సమస్యలు ఎదురైనట్లు తన దృష్టికి వచ్చిందని, ఈసారి అలాంటి సమస్యలు ఏమి లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
అలా కాకుండా కొనుగోళ్ల ప్రక్రియలో రైతులు ఇబ్బందులు పడితే మనం ఫెయిల్ అయినట్లే అని అన్నారు. కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు తనిఖీ చేసినా నిబంధనల అమలు కనిపించాలన్నారు. జిల్లా సరిహద్దు చెక్ పోస్టులలో గట్టి నిఘా ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ అధికారులకు ఆమె సూచించారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో పాన్ గల్ మండలంలోనే అత్యధికంగా వరి సాగు అవుతుందని చెప్పారు.
జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలలో రెండు బ్యానర్లు ఏర్పాటు చేసి, సన్న దొడ్డు రకం ధాన్యాన్ని వేరువేరుగా కొనుగోలు చేయాలన్నారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తే తేమశాతం పరిశీలించిన తర్వాత నిర్వాహకులు గన్ని బ్యాగులను ఇస్తారని, అక్కడే తూకాలు చేయిస్తారని చెప్పారు. కేంద్రాలలో 500 బస్తాలు నిల్వ కాగానే లారీలను తెప్పించుకొని ఆ బస్తాలను లోడ్ చేయించి రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు.
అవగాహన సదస్సులో అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే మళ్లీ శాఖ పరంగా కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. సదస్సులో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సైదులు, డి.ఎస్.పి నల్లపు లింగయ్య, ఆర్టీవో మేఘా గాంధీ, డిఆర్డిఓ మొగులప్ప తమ తమ శాఖలకు సంబంధించిన విషయాల గురించి వివరించారు.
కార్యక్రమంలో ఆర్డిఓ రామచందర్ నాయక్, డి సి ఓ శంకరా చారి, డిఎమ్ఓ బాలామణి, స్థానిక మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, దామర గిద్ద విండో చైర్మన్ పుట్టి ఈదప్ప, అన్ని మండలాల సింగిల్ విండో అధ్యక్షులు, ఐకెపి అధికారులు, ఏవోలు,ఏఈఓ లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
మద్యానికి బానిస అయిన భర్త.. డబ్బులు ఇవ్వడంలేదని భార్య హత్య.. నిందితుడు అరెస్టు..!
-
Health : ఎండు చేపలా, పచ్చివా.. ఆరోగ్యానికి ఏవి మంచివి, గుండె జబ్బు వారికి..!
-
Hyderabad : హైదరాబాద్ నగరంలో దంచికొడుతున్న వర్షం..!
-
Women Entrepreneurs : ఆర్థికంలో అదరగొడుతున్న మహిళలు.. పొదును నుంచి పెట్టుబడుల వరకూ వారే..!









