MLA : ఆ ఎమ్మెల్యేకు ఎంతో ఓపిక.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి..!
MLA : ఆ ఎమ్మెల్యేకు ఎంతో ఓపిక.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఎంతో ఓపికతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రతి బుధవారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమా న్ని నిర్వహించి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వయంగా స్వీకరిస్తున్నారు. వారి సమస్యల పరిష్కారానికి గడువు విధించి అధికారులను ఆదేశిస్తున్నారు. ఫిర్యాదుదారుల వద్దకే వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రతి బుధవారం నిర్వహించే ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో రెండవ వారం సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, పలు శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
వివిధ సమస్యల పరిష్కారం కొరకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు చేరుకొని ఫిర్యాదులు అందజేశారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ దంపతుల వద్దకు నేరుగా ఎమ్మెల్యే వెళ్లి సమస్యలు ఆలకించి ఫిర్యాదును స్వీకరించారు. ఫిర్యాదుదారులకు 15 రోజుల్లో సమస్యను పరిష్కారం జరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తిన అధికారులు వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే గత ప్రభుత్వాల కంటే ముందుగానే సాగునీటిని విడుదల చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు. ఎరువుల కొరత లేకుండా, బ్లాక్ మార్కెట్ ధరలు వెళ్లకుండా దుకాణదారులు రైతులను ఇబ్బందుల గురి చేయకుండా నిరంతరం సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు.
తమ సమస్య ఏదైనప్పటికీ ప్రజావాణి కార్యక్రమం వద్ద ప్రత్యేక అప్లికేషన్లు సిద్ధంగా ఉన్నాయని, సమస్య చెప్తే దరఖాస్తులు వారే నింపి 15 రోజుల్లో సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులు కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారుల్లో కూడా జవాబుదారితనం పెరిగి సామాన్యులకు మేలు జరుగుతుందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నామని. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని అన్నారు.










