District collector : స్కానింగ్ సెంటర్లపై నిరంతర నిఘా..!

District collector : స్కానింగ్ సెంటర్లపై నిరంతర నిఘా..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన జిల్లా స్థాయి బహుళ సభ్య అప్రాప్రియేట్ అధారిటీ కమిటీ సమావేశము నిర్వహించారు. సమావేశంలో గర్భస్థ పూర్వము మరియు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేదం చట్టం 1994 అమలు పై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. జిల్లాలో లింగ నిష్పత్తి గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెడుతూ లింగ నిర్దారణ తెలిపే కేంద్రాలపై పి సి పి ఎన్ డి టి యాక్ట్ 1994 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిఎస్పి నల్లపు లింగయ్య కు సూచించారు.
అలాగే మొదటి మరియు రెండు మాసాలలో జరిగే గర్భస్రావాల పై దృష్టి సారించాలని తెలిపారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిని|సౌభాగ్యలక్ష్మి మాట్లాడుతూ పిసిపి ఎన్ డి టి- చట్టం, మరియు గర్భస్థ లింగ నిర్థారణ గురించి వివరించి ప్రస్తుతము అనుమతి ఉన్న ఆసుపత్రుల వివరాలను తెలిపారు.
జిల్లాలో కొత్తగా 05 స్కానింగ్ కేంద్రాల అనుమతికై దరఖాస్తు చేసుకోగా వాటిని పరిశీలించి పర్యవేక్షించి అనుమతి ఇవ్వడం జరిగిందని, వాటిలో ఒకటి ప్రభుత్వ , నాలుగు ప్రైవేట్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఈ సమావేశంలో పీ. వో. ఎం.హెచ్.ఎన్ డాక్టర్ శైలజ మాట్లాడుతూ పిసిపి ఎన్ డి టి- చట్టం గురించి, విధి విధానాలు, వ్యతిరేకించే వారిపై చట్టరీత్యా విదించే శిక్షలు జరిమానాల గురించి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సఖి కేంద్రం ఏవో క్రాంతి రేఖ,ఎంపీ హెచ్ ఈ ఓ గోవిందరాజు, ఇంచార్జీ డెమో శ్రీనివాసులు, వసంత తదితరులు పాల్గొన్నారు.









