ఆయకట్టులో దండిగా సాగు..!
ఆయకట్టులో దండిగా సాగు..!
మన సాక్షి, నల్లగొండ బ్యూరో :
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టులో రైతులు దండిగా సాగు చేస్తున్నారు. ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడంతో రైతులు ఆనందంలో ఉన్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. రెండు సంవత్సరాల తర్వాత సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంతో రైతులు సాగు పనుల్లో ఉన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు వరి నారు పోసుకొని సిద్ధం చేసుకున్న రైతులు నీటి విడుదలతో నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. బోర్లు, బావుల కింద రైతులు వారి నాట్లు కూడా వేశారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా నాగార్జునసాగర్ జలాశయం అడుగంటి పోయింది. దాంతో సాగునీటికే కాకుండా తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది.
అందువల్ల నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో గత ఏడాది క్రాఫ్ హాలిడే ప్రకటించారు. పంట పొలాలన్నీ బీళ్లుగా మారాయి. ఈ ఏడాది ముందస్తుగానే వర్షాలు సమృద్ధిగా కురవడంతో భిరభిరా కృష్ణమ్మ సాగర్ వైపు కదిలి వచ్చింది. దాంతో సాగర్ ఎడమ కాలువకు ఆగస్టు 2వ తేదీన తెలంగాణ ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. దాంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు.
4.20 లక్షల ఎకరాల్లో సాగు :
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో 4. 20 లక్షల ఎకరాలు ఈ ఏడాది సాగులోకి రానున్నది. ఆయకట్టు పరిధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలు కూడా ఉన్నాయి. ఎడమ కాలువ ఆయకట్టు కాలువల ద్వారా 3.40 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నది.
దాంతో పాటు మరో 80 వేల ఎకరాలు ఎత్తిపోతల పథకాల కింద సాగు చేయనున్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురియడంతో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరు అందే అవకాశం ఉంది. రైతులు సమృద్ధిగా వరి నాట్లు వేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
Nagarjunasagar : సాగర్ కు 5.24 లక్షల క్యూసెక్కుల వరద.. గేట్లు ఎత్తేందుకు టైం ఫిక్స్.. Latest Update
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ మేజర్ లకు సాగునీటి విడుదల..!
BREAKING : రేపు ఉదయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు రెడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తివేత.. హై అలర్ట్..!









