Friendship : స్నేహితులంతా ఒక్కటయ్యారు.. తోటి మిత్రుడు కుటుంబాన్ని ఆదుకున్నారు..!
పదో తరగతిలో పంచుకున్న పాఠాలు, ఆడుకున్న ఆటలు వారి మధ్య విడదీయరాని బంధాన్ని పెంచాయి. కాలం గడిచినా, వృత్తులు మారినా వారి స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు.

Friendship : స్నేహితులంతా ఒక్కటయ్యారు.. తోటి మిత్రుడు కుటుంబాన్ని ఆదుకున్నారు..!
గుర్రంపోడు, మన సాక్షి :
పదో తరగతిలో పంచుకున్న పాఠాలు, ఆడుకున్న ఆటలు వారి మధ్య విడదీయరాని బంధాన్ని పెంచాయి. కాలం గడిచినా, వృత్తులు మారినా వారి స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు. అకాల మరణం చెందిన తమ తోటి మిత్రుడి కుటుంబం రోడ్డున పడిందని తెలియగానే ఆ బ్యాచ్ మిత్రులంతా ఒక్కటయ్యారు.
తమ వంతు సాయంగా రూ. 55,000 పోగు చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆదర్శంగా నిలిచారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన బురాన్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆయన భార్య సల్మా, పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ విషయం పోచంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ 2001 బ్యాచ్ మిత్రులకు తెలియడంతో వారు చలించిపోయారు.
వాట్సాప్ గ్రూపుల ద్వారా చర్చించుకుని, తమ స్నేహితుడి జ్ఞాపకార్థం ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు.
దీంతో బ్యాచ్ సభ్యులందరూ కలిసి తలా కొంత నగదు పోగు చేసి రూ. 55,000 సేకరించారు. ఆదివారం ములకలపల్లిలో మృతుడి భార్య సల్మాకు ఈ నగదును అందజేసి, పిల్లల చదువుల విషయంలోనూ ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
ఆపదలో ఆదుకున్న స్నేహితుల గొప్ప మనసును చూసి మృతుడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. చదువు ముగిసి రెండు దశాబ్దాలు దాటినా, స్నేహ బంధాన్ని బాధ్యతగా మార్చుకున్న ఈ మిత్రబృందాన్ని గ్రామస్తులు, మండల ప్రజలు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.









