Hyderabad : మద్యం మత్తులో బైకును ఢీ కొట్టిన కారు.. మిర్యాలగూడ, హాలియా ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి..!
డ్రంకెన్ డ్రైవ్ ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంది. అతిగా మద్యం తాగిన ఓ వ్యక్తి కారు నడుపుతూ బైకును ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో గాయాల పాలైన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు.

Hyderabad : మద్యం మత్తులో బైకును ఢీ కొట్టిన కారు.. మిర్యాలగూడ, హాలియా ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి..!
మనసాక్షి, హైదరాబాద్ :
డ్రంకెన్ డ్రైవ్ ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంది. అతిగా మద్యం తాగిన ఓ వ్యక్తి కారు నడుపుతూ బైకును ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో గాయాల పాలైన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. హైదరాబాదులోని ఎల్బీనగర్ చౌరస్తా సమీపంలో సాగర్ రోడ్డు ఓంకార్ నగర్ లో చోటు చేసుకుంది.
నల్గొండ జిల్లా హాలియా మండలం అల్వాల గ్రామానికి చెందిన కంచర్ల శివ (20) , మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన నకిరేకంటి సందీప్ కుమార్ (19) బండ్లగూడలోని మహావీర్ ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. శివ సంతోష్ నగర్, సందీప్ హస్తినాపురం లో ఉంటున్నారు. ఇద్దరు కూడా నిరుపేద విద్యార్థులు కావడంతో నెలవారి ఖర్చులకోసం ఆన్లైన్ డెలివరీలు చేసేవారు. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇద్దరు ద్విచక్ర వాహనంపై ఓంకార్ నగర్ లో డెలివరీ ఇచ్చి తిరిగి ఎల్బీనగర్ వైపు వెళ్తున్నారు.
ఆ సమయంలో ఓంకార్ నగర్ రహదారి మీద డివైడర్ మధ్య నుంచి రోడ్డు యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇరుకుగా ఉండడంతో వాహనాన్ని ఆపి నెమ్మదిగా దాటించాలని చూశారు. ఆ సమయంలో బి.ఎన్.రెడ్డి నగర్ లోని టీచర్స్ కాలనీ చెందిన కనకాల రామ్ కుమార్ రెడ్డి కారులో బైరామాల్ గూడ వంతెన పైనుంచి వేగంగా దూసుకొచ్చి తొలుత రోడ్డు దాటుతున్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లికి చెందిన సభావత్ శ్రీధర్ ను ఢీకొట్టాడు. అప్పటికే వాహనం అదుపుతప్పి కొద్ది దూరంలోని బైక్ మీద ఉన్న శివ, సందీప్ ని కూడా ఢీకొట్టాడు.
వాహనాన్ని ఢీ కొట్టిన తర్వాత 100 మీటర్ల దూరం వరకు కారు వారిని ఈడ్చుకుంటూ వెళ్లి బోల్తా పడింది. ఆ సమయంలో సభావాత్ శ్రీధర్ కాలు విరిగి తీవ్ర గాయపడ్డారు. ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే శివ, సందీప్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ప్రమాదం అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కార్ డ్రైవర్ రామ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా రక్తంలో మద్యం మోతాదు 150 కి ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదానికి ముందు రామ్ కుమార్ తన భార్యను నాగోల్ లో దింపి కర్మన్ ఘాట్ లో మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు.









