షాద్ నగర్ శివాలయంలో విగ్రహాలు ధ్వంసం.. సందర్శించిన ఎంపీ డీకే అరుణ..!
షాద్ నగర్ శివాలయంలో విగ్రహాలు ధ్వంసం.. సందర్శించిన ఎంపీ డీకే అరుణ..!
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :
కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు తరుచూ జరుగుతున్నాయని, కొందరు దుండగులు విగ్రహాలను ధ్వంసం చేసి వికృతానందం పొందుతున్నారని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని జానంపేట వివేకానంద కాలనీలో గల పురాతన శివాలయంలో శివలింగం అపహరణ, ఇతర విగ్రహాల ధ్వంసం ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఆలయాన్ని పరిశీలించిన డీకే అరుణ స్థానికులను జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలపై కుట్రపూరితంగా తరుచూ దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడుల వెనుక ప్రధాన కుట్ర మత కల్లోలాలను సృష్టించడమేనని దుండగులు ఎవరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వెంటనే వారిని పట్టుకుని పోలీసు శాఖ కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.
గణపతి, నంది విగ్రహాలను చెల్లా చెదురుగా పడేశారని, ఆలయంలో ఉన్న శివలింగం మాయం చేశారని ఇంకా శివలింగం జాడ పోలీసులు కనిపెట్టకపోవడం ఏమిటని డీకే అరుణ ప్రశ్నించారు. ఇవి అనవసర చర్యలని దేవాలయాలపై కుట్రపూరితంగా దాడులకు దిగుతూ వికృతానందం పొందుతున్నారని ఆవేదన చెందారు.
రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అమ్మవారి విగ్రహాలు, శివలింగాలు, గ్రామదేవతల విగ్రహాలు ధ్వంసం చేయడం సబబు కాదని, దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వలన ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని డీకే అరుణ ఆరోపించారు. ఇలాంటి దౌర్భాగ్య పనులకు పాల్పడే వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోలీస్ శాఖ వెంటనే గుర్తించాలని ఆమె డిమాండ్ చేశారు.
శివలింగం ఏమైంది? ఈ కుట్ర ఎవరు చేశారు అనే కోణంలో పోలీసులు ఇంకా దర్యాప్తు చేయకపోవడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తరచూ ఇలాంటి సంఘటనలు ఎక్కడపడితే అక్కడ చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు చేపట్టి దుండగులను అత్యంత కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
డీకే అరుణ వెంట బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, చెట్ల వెంకటేష్, ఎంకనోళ్ళ వెంకటేష్, కాసోజు శివ, ఆకుల ప్రదీప్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









