నల్గొండBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణ

Nalgonda : విద్య, వైద్య రంగాలలో నల్గొండ జిల్లాను ఆదర్శంగా నిలపాలి.. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపు..!

Nalgonda : విద్య, వైద్య రంగాలలో నల్గొండ జిల్లాను ఆదర్శంగా నిలపాలి.. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపు..!

నల్లగొండ, మనసాక్షి,

విద్య, వైద్య రంగాలలో పేద ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన జిల్లా గజిటెడ్ అధికారుల సంఘం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రైవేట్ పాఠశాలలు, ఆసుపత్రులకు దీటుగా సేవలందించే విధంగా తీర్చిదిద్దేందుకు జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, రైస్ మిల్లర్లు, ఇతర సంస్థలు ,దాతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.

ముందుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్ని ఉన్నత పాఠశాలను, అదేవిధంగా కొన్ని ఆసుపత్రులను పూర్తి కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించి ప్రైవేటు పాఠశాలలు, ఆసుపత్రులలో సేవలందిస్తున్నట్లుగానే సేవలందించేందుకు ఉద్దేశించి సహకారం విషయమై మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లాలోని పారిశ్రామిక సంస్థలు, రైస్ మిల్లర్లు, ఇతర సంస్థలు, అసోసియేషన్ల ప్రతినిధులతో కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందులో భాగంగానే అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా జిల్లాలోని 936 పాఠశాలల్లో 48 కోట్ల రూపాయలతో పనులు చేపట్టి 40 కోట్ల రూపాయలను ఖర్చుచేసి పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సైతం అనేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

అయితే ప్రభుత్వమే అన్ని సౌకర్యాలను కల్పించలేదని, ప్రజల భాగస్వామ్యం ప్రత్యేకించి కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం సైతం అవసరమని అన్నారు. గుణాత్మక విద్య అందించినప్పుడు పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలకు వస్తారని, అదేవిధంగా వైద్య రంగంలో మాతా, శిశు సంరక్షణ విషయంలో జిల్లాలో ఇంకా ఎక్కువగా పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు .ఈ ప్రయత్నంలో భాగంగా ముందుగా కొన్ని పాఠశాలలను ఎంపిక చేసుకొని ప్రయోగాత్మకంగా కార్పొరేట్ విద్యను, వైద్యాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం అడుగు ముందుకు వేస్తున్నదని ,ఇందుకు పారిశ్రామిక సంస్థలు, దాతలు ఇతర సంస్థలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.

ఎంపిక చేసిన పాఠశాలల్లో, ఆసుపత్రులలో ప్రైవేటుకు దీటుగా మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని, అంతేకాక మానవ వనరులను సైతం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని, పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సాయంత్రం సమయంలో స్నాక్స్ వంటివి ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు అన్ని సౌకర్యాలు కల్పించి అలాగే ఆ పాఠశాలలకు సంబంధించి వసతి గృహాలను సైతం పూర్తిస్థాయిలో తీర్చిదిద్ది వాటి ద్వారా మంచి విద్యను అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆలోచిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

ఆగస్టు 15 నాటికి మొదటి విడతన కొన్ని ప్రభుత్వ పాఠశాలలు,ఆసుపత్రులలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.జిల్లా కలెక్టర్ ప్రతిపాదనకు కొన్ని పారిశ్రామిక సంస్థలు, రైస్ మిల్లర్లు, ఇతర సంస్థల ప్రతినిధులు ముందుకు వచ్చి విద్య, వైద్యం వంటి అతి ముఖ్యమైన రంగాలలో పేద ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ చొరవను ప్రశంసించారు.

ఇందుకు తమ వంతు సహకారాన్ని పూర్తిగా అందిస్తామని తెలిపారు. అయితే జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటుచేసిన పరిశ్రమల ద్వారా ఇదివరకే కొన్ని పాఠశాలల్లో సౌకర్యాలు అలాగే వైద్య సదుపాయాల కల్పన వంటివి చేపట్టడం జరుగుతున్నదని, కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు, ప్రభుత్వం ఒకే ఆలోచనతో కొన్ని పాఠశాలలు, ఆస్పత్రులపై ముందుగా దృష్టి సారిస్తే అవి విజయవంతమైనట్లయితే తర్వాత మరింత ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉందని అన్నారు.

ఇందుకుగాను ముందుగా వాటి నిర్వహణపై దృష్టి సారించడంతోపాటు, విద్య, వైద్య సంస్థల నిర్వహణలో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఈ రెండు రంగాలలో సహకారం అందించేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలు, సంస్థలు, వ్యక్తులు జిల్లా కలెక్టర్ పేరున మాత్రమే చెక్కు లేదా డిడి లు సమర్పించాలని కోరారు. ఆయా పారిశ్రామిక సంస్థలు, వ్యక్తులు, సమర్పించే ప్రతి రూపాయికి జిల్లా యంత్రాంగం బాధ్యత వహిస్తుందని, ఏ సమయంలోనైనా వారు చెల్లించిన మొత్తానికి లెక్కలు చూసుకోవడంతో పాటు, పనులను పరిశీలించుకోవచ్చని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.

జిల్లా కలెక్టర్ పిలుపునిందుకొని జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం ఒకరోజు వేతనాన్ని విద్య, వైద్య రంగాలలో కార్పొరేట్ తరహాలో సేవలు అందించేందుకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు .ఈ మేరకు జిల్లా గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు రాజకుమార్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు లేఖను జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కు అందజేశారు.

ఆదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, గృహ నిర్మాణ పీడీ రాజకుమార్, హేట్రో, నాట్కో, ఇండియన్ సిమెంట్స్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తదితర పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి : 

Jurala project : జూరాలకు కొనసాగుతున్న భారీ వరద… తెరుచుకున్న 37 గేట్లు..!

BUDGET 2024: మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం, వ్యవసాయం, గృహ నిర్మాణ రంగాలకు కేటాయింపులు, ఉద్యోగాలకు భారీ ప్రోత్సాహం.. బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు

రుణమాఫీ ప్రక్రియను బ్యాంకులలో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు