Suryapet : సూర్యాపేట జిల్లాలో నకిలీ పురుగుమందుల గుట్టురట్టు..!
రైతు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ మందుల విక్రయాలకు తెరలేపిన ఓ డీలర్ భాగోతాన్ని వ్యవసాయ శాఖ అధికారులు గుట్టు రట్టు చేశారు. సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

Suryapet : సూర్యాపేట జిల్లాలో నకిలీ పురుగుమందుల గుట్టురట్టు..!
బేయర్ (నేటివో) పేరుతో నయా దందా*..!
3 లక్షల విలువైన నకిలీ పురుగుల మందు సీజ్..!
లైసెన్స్ ఒకటికి.. వ్యాపారం మరొకటికి…!
సూర్యాపేట, మనసాక్షి
రైతు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ మందుల విక్రయాలకు తెరలేపిన ఓ డీలర్ భాగోతాన్ని వ్యవసాయ శాఖ అధికారులు గుట్టు రట్టు చేశారు. సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
సూర్యాపేట జిల్లా మఠంపల్లి బక్కమంతుల గూడెం గ్రామానికి చెందిన మరిడి సత్యనారాయణ అనే డీలర్ ‘ఎస్.ఆర్.ఆర్ (శ్రీ రాజ రాజేశ్వరి) ఆగ్రో లింక్స్’ పేరుతో ఎరువుల విక్రయాలకు లైసెన్స్ పొందారు. అయితే, అధిక లాభాల కోసం అక్రమ మార్గాన్ని ఎంచుకున్న సత్యనారాయణ, ప్రముఖ బహుళజాతి సంస్థ ‘బేయర్’ కంపెనీకి చెందిన ‘నేటివో’ అనే తెగుళ్ల నివారణ మందును నకిలీగా తయారు చేయడం ప్రారంభించారు.
సొంతంగా కంపెనీ లేబుల్స్‌ను ముద్రించి, నాసిరకం పౌడర్‌ను చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి రైతులను నమ్మిస్తూ విక్రయిస్తున్నాడు. తమ కంపెనీ పేరుతో నకిలీ మందులు అమ్ముతున్నట్లు గుర్తించిన బేయర్ కంపెనీ ప్రతినిధులు వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను, పోలీసువారిని ఆశ్రయించారు.
హుజూర్ నగర్ ఏడీఏ రవి, మఠంపల్లి ఏవో శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి సదరు గోడౌన్‌పై మెరుపు దాడి నిర్వహించారు.ఈ దాడిలో సుమారు 65 ప్యాకెట్ల విడి పౌడర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 3 లక్షల ఉంటుందని నకిలీ పౌడర్ నమూనాలను తదుపరి పరిశీలన నిమిత్తం జిల్లా కేంద్రంలోని టెస్టింగ్ ల్యాబ్‌కు పంపించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీదర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారి మాట్లాడుతూ.. తక్కువ ధరకు వస్తున్నాయని నకిలీ మందులు కొని మోసపోవద్దని మందులు కొనుగోలు చేసిన చోట రసీదులు పొందాలని రైతులు అప్రమత్తంగా ఉండాలి సూచించారు. నకిలీ మందుల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా డీలర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.









