Rythu Bharosa : రైతు భరోసా ఇక వారికేనా.. ఇంకెత కాలం.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా ఇక వారికేనా.. ఇంకెత కాలం.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ఆగమ్యగోచరంగా మారింది. రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. పంట పెట్టుబడి సహాయం కోసం ప్రారంభించిన రైతు భరోసా పథకం పంటలు పూర్తయినప్పటికీ కూడా రైతులందరికీ ఇంకా అందలేదు. ప్రభుత్వం మాత్రం అప్పుడిస్తాం. ఇప్పుడిఇస్తాం.. అంటూ హామీలు ఇస్తూ జాప్యం చేస్తుంది. ఆలస్యంతో రైతుల్లో నిరాశ పెరుగుతోంది.
2025 జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఎకరానికి 12,000 రూపాయలను పంట పెట్టుబడికి ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేయాలని నిర్ణయించింది.
ఒక విడత యాసంగి సీజన్ కుగాను 6000 రూపాయలను ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిన మొదట్లో రైతులకు వారి ఖాతాలలో జమ చేసింది. మార్చి నెలాఖరు వరకు పంటలు సాగు చేసిన రైతులందరికీ రైతు భరోసా పథకం కింద నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కానీ ఇప్పటి వరకు నాలుగు ఎకరాలకు వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా పథకం అందింది. నాలుగు ఎకరాలకు పైబడిన రైతులకు ఇప్పటివరకు రైతు భరోసా పథకం అందలేదు. దాంతో రైతుల్లో అసంతృప్తి తీవ్రంగా ఉంది.
ఇప్పటి వరకు 57 లక్షల మంది రైతులకు నాలుగు ఎకరాల లోపు ఉన్న వారికి 5057 కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇంకా 13 లక్షల మంది రైతులు నాలుగు ఎకరాలకు పైబడి ఉన్నవారు ఉన్నారు. వారికి గాను 4వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కు విడుదల చేయాల్సి ఉంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా రైతు భరోసా పథకం ఆలస్యమైందని చెప్పినప్పటికీ యాసంగి సీజన్ ముగిసినప్పటికీ కూడా రైతుల ఖాతాలలో నిధులు జమ కాలేదు.
గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి పదివేల రూపాయలను రెండు విడతలుగా ఎలాంటి షరతులు లేకుండా అందించేశారు. సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరానికి 15 వేల రూపాయలను రైతు భరోసా పథకం ద్వారా అందజేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా ఆర్థిక పరిస్థితుల కారణంగా వాటిని ఎకరానికి 12,000 రూపాయలకు కుదించారు. అయినా కూడా గత సంవత్సరం వానాకాలం సీజన్ లో రైతు భరోసా పథకం నిధులు రైతులకు అందలేదు. యాసంగి సీజన్ కూడా కేవలం నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతుల ఖాతాలలో నిధులు జమ అయ్యాయి.
తిరిగి వానా కాలం సీజన్ ప్రారంభమయ్యింది. ఇప్పటివరకు రైతు భరోసా కోసం రైతులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతుల వరకే రైతు భరోసా అందజేస్తుందా ఈ ప్రభుత్వం అని మిగతా రైతులు నిరాశ చెందుతున్నారు.









