Srisailam : శ్రీశైలంకు భారీ వరద.. గంట గంటకు పెరుగుతున్న నీటిమట్టం.. ఇక గేట్లు ఎత్తుడే..!

Srisailam : శ్రీశైలంకు భారీ వరద.. గంట గంటకు పెరుగుతున్న నీటిమట్టం.. ఇక గేట్లు ఎత్తుడే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
కృష్ణానది ఎగువ భాగంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దాంతో శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సోమవారం ఉదయం జూరాల ప్రాజెక్టు నుంచి 1.56 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో అదే ప్రవాహం శ్రీశైలం జలాశయంలోకి చేరుతుంది. ఇదేవిధంగా వరద నీరు వచ్చి చేరితే మరో రెండు రోజుల్లోనే శ్రీశైలం జలాశయం నిండే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేయనున్నారు.
శ్రీశైలం జలాశ నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 872.50 అడుగులకు చేరింది. మరో 12 అడుగులు చేరితే ప్రాజెక్టు నిండుకుండలా మారుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం నీటి సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 152 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టులో ఉంది. జలాశంలోకి వరద నీరు భారీగా చేరుతున్నందున అధికారులు అప్రమత్తమయ్యారు.
జలాశ నీటిమట్టం పెరిగితే డౌన్ స్ట్రీమ్ ప్రాంతంలోని ప్రజలకు ముందస్తుగా సమాచారం ఇవ్వనున్నారు. పర్యాటకులకు కూడా ముందస్తుగా అప్రమత్తం చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. గేట్లు ఎత్తే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.









