CM Revanth Reddy : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక భేటీ.. విద్యాభివృద్దికి మద్దతు ఇవ్వండి..!

CM Revanth Reddy : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక భేటీ.. విద్యాభివృద్దికి మద్దతు ఇవ్వండి..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
విద్యా రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు.
ముఖ్యమంత్రి న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పార్లమెంట్‌లోని వారి ఛాంబర్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 105 శాసనసభ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (YIIRS) ప్రాధాన్యతను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు.
5 నుంచి 12 తరగతుల వరకు ఉండే ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ( YIIRS)లో 2,560 మంది విద్యార్థులు ఉంటారని, మొత్తంగా 105 పాఠశాలతో 2.70 లక్షల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా నాణ్యమైన విద్యాబోధన లభిస్తుందని వివరించారు. YIIRSలు సమీప ప్రభుత్వ పాఠశాలలకు విద్యా హబ్‌లుగా ఉండడంతో పరోక్షంగా లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని తెలియజేశారు.
అత్యాధునిక వసతులు, లేబొరేటరీలు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్యయమవుతుందని తెలిపారు. అలాగే, రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ఆధునిక ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు.
మొత్తంగా రాష్ట్రంలో విద్యా రంగం సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు వెచ్చించినున్నట్లు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక ప్రయోజన సంస్థ (SPC) ఏర్పాటు చేయనున్నామని, తద్వారా సేకరించే రుణాలకు ఎఫ్ఆర్‌బీఎం పరిమితి నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి కోరారు. విద్యా రంగంపై ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధికి చేస్తున్న పెట్టుబడిగా భావించాలని కోరారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, తెలంగాణలో విద్యా రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చూపుతున్న చొరవను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. YIIRS మోడల్ బాగుందన్న కేంద్ర మంత్రి SPC కి సంబంధించిన వివరాలను అందజేయాలని సూచించారు.
సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఎంపీలు మందాడి అనిల్ కుమార్, డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.










