Runamafi : కుటుంబ నిర్ధారణ సరే.. వారికి రుణమాఫీ ఎప్పుడంటే..!
Runamafi : కుటుంబ నిర్ధారణ సరే.. వారికి రుణమాఫీ ఎప్పుడంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ.. రైతుల్లో ఇంకా గందరగోళంగానే ఉంది. రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చెందుతుండగా అధికారులు కుటుంబ నిర్ధారణ చేయాల్సి ఉందని ఇంటింటికి సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి కుటుంబ నిర్ధారణ చేశాక వారికి రుణమాఫీ ఎప్పుడు వస్తుందో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రుణ విముక్తులను చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశారు. మూడు విడతలుగా ఆగస్టు 15వ తేదీ లోగా 2 లక్షల రూపాయల రుణమాఫీని చేశారు. బ్యాంకర్లు ఇచ్చిన సమాచారం మేరకు రైతులకు వారి వారి బ్యాంకు ఖాతాలలో నేరుగా రుణమాఫీ సొమ్మును జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు.
కానీ అందరికీ రుణమాఫీ రాలేదని ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన ప్రకారం 32 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉందని ప్రకటించింది. కానీ ఆ మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అందరి రైతులకు రుణమాఫీ కాలేదు. దాంతో రైతులు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కుటుంబ నిర్ధారణ :
రుణమాఫీ పొందని రైతుల నుంచి వ్యవసాయాధికారులు పూర్తి వివరాలు సేకరించారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా, పట్టాదార్ పాస్ పుస్తకంలో తప్పులు దొర్లడం వల్ల సాంకేతిక కారణాల వల్ల అందరికీ రుణమాఫీ కాలేదని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో రైతుల వద్ద నుంచి వ్యవసాయాధికారులు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను స్వీకరించారు.
రైతుల వద్ద నుంచి సేకరించిన ఫిర్యాదుల ఆధారంగా వ్యవసాయాధికారులు రైతుల ఇంటి వద్దకే వెళ్లి ప్రత్యేకమైన రైతు భరోసా యాప్ ద్వారా రైతులను కుటుంబ నిర్ధారణ కార్యక్రమం కొనసాగుతుంది. రైతుల ఇంటికెళ్లి రైతుల పత్రాలు పరిశీలించడంతో పాటు కుటుంబ నిర్ధారణ కూడా చేస్తున్నారు. కాగా కుటుంబ నిర్ధారణ చేసి గ్రామపంచాయతీ కార్యదర్శి సంతకంతో ఉన్న పత్రాన్ని కూడా తీసుకొని యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు.
రుణమాఫీ సొమ్ము ఖాతాలలోకి ఎప్పుడు..?
వ్యవసాయ అధికారులు సేకరించిన ఆధారాలను రైతు భరోసా యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు. కానీ కుటుంబ నిర్ధారణ చేసిన రైతులకు రుణమాఫీ ఎప్పుడు వస్తుందో అని చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాతనే వస్తుందని వారికి తెలియజేస్తున్నారు. కాగా వాస్తవానికి కుటుంబ నిర్ధారణ అయిన తర్వాత రుణమాఫీకి అర్హులైన రైతులకు విడతల వారీగా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తారని సమాచారం.
అర్హులైన రైతులకు గతంలో మాదిరిగానే మొదటి విడతగా లక్ష రూపాయల లోపు, రెండవ విడతగా లక్షన్నర రూపాయల లోపు, మూడవ విడతగా రెండు లక్షల రూపాయల లోపు ఉన్న రైతులకు వారి వారి ఖాతాలలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం రెండు లక్షలకు పైగా ఋణం ఉన్న రైతులకు కూడా విడతల వారీగా అదనంగా ఉన్న డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం ప్రకటించనున్నది.
ప్రభుత్వం ప్రకటించిన తేదీలలో 2 లక్షల రూపాయల రుణంకు పైగా ఉన్న రైతులు డబ్బులు చెల్లిస్తే వారి ఖాతాలలో 2 లక్షల రూపాయలను ప్రభుత్వం జమ చేయనున్నది. కుటుంబ నిర్దారణ జరిగిన రైతులకు సెప్టెంబర్ మొదటి వారంలో వారి వారి ఖాతాలలో రుణమాఫీ సొమ్ము జమ అయ్యే అవకాశం ఉంది.
LATEST UPDATE :
Rythu Barosa : రైతు భరోసా యాప్ తో రుణమాఫీ సమస్యలకు చెక్..!
నిరుద్యోగులకు శుభవార్త.. 2280 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!
మిర్యాలగూడ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీఎంఆర్ఎఫ్ స్కాం.. అరెస్టుకు సిద్ధమైన సిఐడి..!
Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!











