CM Revanth Reddy : దేవుడినైనా ఎదిరిస్తా.. తెలంగాణ ప్రజల తరపున నిలబడతా..!
CM Revanth Reddy : దేవుడినైనా ఎదిరిస్తా.. తెలంగాణ ప్రజల తరపున నిలబడతా..!
హైదరాబాద్, మన సాక్షి :
కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కులను ఎవ్వరికీ తాకట్టు పెట్టం. ఎంతటి వారొచ్చినా నిటారుగా నిలబడి కొట్లాడుతం. దేవుడే ఎదురుగా వచ్చి నిలబడినా ఎదురించి ప్రజలకు అండగా నిలబడుతాం. తెలంగాణ ప్రజల్లో శాశ్వతంగా, గొప్పగా నిలిచిపోయే విధంగా మా విధానం ఉంటుంది. ప్రజల హక్కులను తాకట్టు పెట్టం..” అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
ప్రజలు ఒక విశ్వాసం, నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో దేవుడే వచ్చి ఎదురుగా నిలబడినా దేవుడినైనా ఎదురించి తెలంగాణ ప్రజల తరఫున నిలబడుతం. కృష్ణా, గోదావరి జిలాల్లో తెలంగాణ హక్కుల విషయంలో ఎవ్వరూ అధైర్య పడొద్దు అని భరోసానిచ్చారు.
కృష్ణా, గోదావరి నదీ జలాలు : వినియోగం : వివాదాలు అన్న అంశంపై జరిగిన, జరుగుతున్న పరిణామాలపై జ్యోతీరావు పూలె ప్రజా భవన్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.
కృష్ణా జలాలపై గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలతో పాటు ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ప్రాధాన్యత, దాన్ని తర్వాత క్రమంలో తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు స్థల మార్పు, తదనంతర పరిణామాలపై మంత్రి మరో ప్రజెంటేషన్ రూపంలో సమగ్రంగా వివరించారు. మేడిగడ్డలో నీటిని నిలువ చేస్తే ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలోని అంశాలను విడమరిచి చెప్పారు.
అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో జరిగిన, జరుగుతున్న పరిణామాలపై శాసనసభలో అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణ హక్కుల కోసం ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై పాలసీ డాక్యుమెంట్‌ను సభ ముందు అందజేస్తామని చెప్పారు.
స్పీకర్ అనుమతితో నీటి పారుదల రంగ నిపుణులు, న్యాయ శాఖ నిపుణులు, స్టేక్ హోల్డర్స్ అందరినీ ఆహ్వానించి ఒక మంచి సానుకూల వాతావరణంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ శాశ్వత హక్కులను కాపాడుకోవడం కోసం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు వాస్తవాలు చేరవేయడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
వరద జలాలను వినియోగించుకుంటామని ఆంధ్రప్రదేశ్ వాదనను ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. ముందు నికర జలాల్లో వాటా తేలాలన్నారు. నికర జలాల్లో వాటా తేలిన తర్వాత మిగులు, వరద జలాల్లో ప్రొరేటా ప్రకారం ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు జరగాలన్నారు.
“నీటి వాటాలో తెలంగాణ హక్కుల కోసం సంబంధిత సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ముందు వాదనలు వినిపించడమే కాకుండా న్యాయస్థానాల్లో పోరాడుతున్నాం. ఈ విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి స్వయంగా సమన్వయం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే నీటి వాటాలో రాష్ట్ర హక్కులు దక్కేవి. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా నివశిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి ఉమ్మడి కోటా కింద నీటి వాటా కోరి ఉంటే ఈరోజు పరిస్థితి కొంత భిన్నంగా ఉండేది.
తెలంగాణ నీటిని రాయలసీమకు తరలించడం వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పనికిరాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ రకంగా తక్కువ ధరకు లభించే విద్యుత్ విషయంలోనూ అన్యాయం జరిగింది.
ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన కల్వకుర్తికి నీటి కేటాయింపులను పూర్తి చేయలేదు. బీమా, నెట్టెంపాడు, నల్గొండకు గ్రావిటీతో తీసుకెళ్లే ఎస్ఎల్ బీసీ పూర్తి చేయలేదు. ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయని కారణంగా తెలంగాణకు అన్యాయం జరిగింది.
ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిపై 2007-08 లో ప్రాణిహిత చేవెళ్ల (డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి) ప్రాజెక్టు తుమ్మడిహెట్టి నుంచి ప్రాంతాన్ని, అంచనాలను, పేరును మార్చడమే కాకుండా బేసిన్ల సాకుతో రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని ఆయకట్టును తొలగించడం వల్ల నష్టం జరిగింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం 54 లక్షల ఎకరాలకు నీరిస్తే, ఎకరాకు 93 వేల రూపాయలు ఖర్చయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం 15 లక్షల ఎకరాలకు నీరు ఇస్తే, ఎకరాకు 11.47 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఇలా ప్రతి విషయంలోనూ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది.
నీటి వాటాలకు సంబంధించిన అంశాలపై జరిగిన, జరుగుతున్న పరిణామాలపై సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వాస్తవాల ప్రాతిపదికన ఒక నివేదికను అందించారని ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఎరువుల దుకాణాల ఆకస్మిక తనిఖీ..!
-
Hyderabad : CM రేవంత్ Vs కేటీఆర్.. ప్రెస్ క్లబ్ వద్ద భారీ బందోబస్తు..!
-
Srisailam : శ్రీశైలం కు భారీగా వరద పోటు.. గేట్లు ఎత్తేందుకు సిద్ధమైన అధికారులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Fish Venkat : ఫిష్ వెంకట్ కు అండగా జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని..!









