TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

ఆమనగల్లు శ్రీరామలింగేశ్వర స్వామి జాతరకు పోదామా..!

కాకతీయ కాలం నుండి ప్రసిద్ధి, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన శ్రీ రామలింగేశ్వర జాతర రానే వచ్చింది. రాష్ట్రంలోనే నాలుగో జాతరగా గుర్తింపు పొందిన జాతరగా నిలిచింది. రేపటి నుండి జాతర అట్టహాసంగా ప్రారంభం కానుంది.

ఆమనగల్లు శ్రీరామలింగేశ్వర స్వామి జాతరకు పోదామా..!

– రేపటి నుండి ప్రారంభం కానున్న జాతర

– అగ్నిగుండాలు-నంది వాహన సేవ ప్రత్యేక ఆకర్షణ

– భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు

– క్రీడలకు మారుపేరుగా నిలిచిన జాతర

– దేవాలయ చైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్

వేములపల్లి, మన సాక్షి:

కాకతీయ కాలం నుండి ప్రసిద్ధి, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన శ్రీ రామలింగేశ్వర జాతర రానే వచ్చింది. రాష్ట్రంలోనే నాలుగో జాతరగా గుర్తింపు పొందిన జాతరగా నిలిచింది. రేపటి నుండి జాతర అట్టహాసంగా ప్రారంభం కానుంది. గణపతి పూజతో ప్రారంభమై నాలుగు రోజులపాటు జాతర జరగనుంది.ఈ జాతర పురాతన కాలం నుండి క్రీడలకు మారుపేరుగా నిలిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి కృపను పొందనున్నారు.స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి జాతరను ఆదివారం ఉదయం స్థానిక నాయకులతో కలిసి అట్టహాసంగా ప్రారంభించనున్నారు.

జాతర రెండవ రోజు గణపతి పూజ, ధ్వజారోహణం సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఎదుర్కోలు నిర్వహించడం జరగనుంది. మూడవరోజు సంస్కృతిక కార్యక్రమాలు, స్వామి వారి కళ్యాణం వైభవంగా గ్రామ పురోహితులు నారాయణ సూరి శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ శివపార్వతుల కళ్యాణం కమనీయంగా జరగనుంది. జాతర నాలుగవ రోజు అగ్నిగుండాలు, శ్రీ భద్రకాళి అమ్మవారికి బోనాలు శర్మ సమర్పించడం జరుగుతుంది.

జాతరలో రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. శివపార్వతుల కళ్యాణంలో దంపతులు పాల్గొని స్వామి వారి కృపను పాలుపంచుకుంటారు. కళ్యాణం లో ఇరువురు దంపతులు ఒకరికి ఒకరు తీర్థప్రసాదాలను ఇచ్చిపుచ్చుకుంటారు. దేవాలయ ప్రాంగణంలో పురాతన కాలం నుండి అగ్నిగుండాలు నిర్వహించడం ఆనవాయితీగా నిలిచింది.

భక్తులు పెద్ద ఎత్తున అగ్నిగుండాల నుండి వెళ్లడం… నంది వాహన సేవను పట్టుకొని భక్తులు కోరిన కోరికలు తీరాలని మొక్కులు తీర్చుకుంటారు. అలాగే జాతరలో కబడ్డీ,ఎడ్ల పందాలు, క్యారమ్స్, కోలాటం,చెస్ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను, నగదును అందిస్తారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వం సిద్ధం చేశామని తెలిపారు.

జాతరకు వచ్చే క్రీడాకారులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గుట్ట పరిసర ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మిర్యాలగూడ -వయా భీమారం 5 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంటుందని తెలిపారు.

దేవాలయ చైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్

రాష్ట్రంలోనే శ్రీ రామలింగేశ్వర జాతర నాలుగో స్థానంలో పెద్ద జాతరగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవాలయాలు సుందరంగా మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మంత్రుల సహకారంతో దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.కులాలకు, మతాలకు అతీతంగా జాతరను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

మరిన్ని వార్తలు