Nalgonda : మిత్రమా మేమున్నాం.. అండగా స్నేహితులు..!
ప్రాణ స్నేహితుడు అనారోగ్యంతో అకాల మరణం చెందగా, ఆ మిత్రుడి కుటుంబం రోడ్డున పడకుండా 2005-06 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు తమ వంతు బాధ్యతగా అండగా నిలిచారు.

Nalgonda : మిత్రమా మేమున్నాం.. అండగా స్నేహితులు..!
గుర్రంపోడు, డిసెంబర్ 31, మన సాక్షి:
ప్రాణ స్నేహితుడు అనారోగ్యంతో అకాల మరణం చెందగా, ఆ మిత్రుడి కుటుంబం రోడ్డున పడకుండా 2005-06 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు తమ వంతు బాధ్యతగా అండగా నిలిచారు. గుర్రంపోడు మండలం పిట్టలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-06 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న వేముల కొండలు (వెంకటాపురం గ్రామం) పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు.
కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కొండలు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన స్నేహితులు నిర్ణయించుకున్నారు. పిట్టలగూడెం హైస్కూల్ మిత్రులందరూ సమన్వయం చేసుకుని తలా కొంత నగదు పోగు చేసి, మొత్తం 40,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సేకరించారు.
బుధవారం రోజున మిత్రుల బృందం వెంకటాపురం గ్రామంలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించి, సేకరించిన నగదును అందజేశారు.
ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. తమతో కలిసి చదువుకున్న కొండలు మరణం తమను తీవ్రంగా కలిచివేసిందని, వారి పిల్లల భవిష్యత్తు కోసం ఈ చిన్న సాయం చేశామని తెలిపారు. చిన్ననాటి స్నేహితులు చూపిన ఈ మానవత్వాన్ని స్థానికులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.









