Nalgonda : నల్గొండ జిల్లాలో హోలీ వేడుకల్లో తీవ్ర విషాదం.. సాగర్ ఎడమ కాలువలో ఇద్దరు గల్లంతు..!
హోలీ పండుగ సందర్భంగా నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సాగర్ ఎడమ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతైన సంఘటన హాలియా ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగింది.

Nalgonda : నల్గొండ జిల్లాలో హోలీ వేడుకల్లో తీవ్ర విషాదం.. సాగర్ ఎడమ కాలువలో ఇద్దరు గల్లంతు..!
మన సాక్షి:
హోలీ పండుగ సందర్భంగా నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సాగర్ ఎడమ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతైన సంఘటన హాలియా ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగింది. హాలియా పోలీసుల వివరాల ప్రకారం, పెద్దవూర మండలం సిరసనగండ్ల గ్రామానికి చెందిన కన్నేకుంట్ల బబ్లు చారి (17), నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన ఆలేటి కార్తీక్ (14), అలాగే శాకాపురం గ్రామానికి చెందిన పోలేపల్లి నాని తదితరులు హోలీ పండుగ జరుపుకున్న అనంతరం సాగర్ ఎడమ కాలువలోని హాలియా అక్విడెక్ట్ సమీపానికి వెళ్లారు.
అక్కడ బిర్యాని తిన్న అనంతరం చేతులు కడుక్కునేందుకు కార్తీక్ కాలువలోకి దిగగా కాలుజారి నీటిలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు బబ్లు చారి కాలువలోకి దిగి రక్షించే ప్రయత్నం చేయగా తాను కూడా నీటిలో మునిగిపోయాడు. ఈ ఘటనతో భయపడిన పోలేపల్లి నాని వెంటనే గల్లంతైన యువకుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న హాలియా పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, సాయంత్రం వరకు యువకుల ఆచూకీ లభించలేదు. ఉదయం నుంచి కలిసి తిరిగిన ఇద్దరు స్నేహితులు గల్లంతవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. గల్లంతైన బబ్లు చారి బైక్ రిపేర్ సెంటర్లో పనిచేస్తుండగా, కార్తీక్ 9వ తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. హాలియా సీఐ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
By : Kathi SrinivasReddy, Haliya









