Additional collector : కొత్త పథకాల ఎంపికకు ఇవీ మార్గదర్శకాలు.. అదనపు కలెక్టర్..!
Additional collector : కొత్త పథకాల ఎంపికకు ఇవీ మార్గదర్శకాలు.. అదనపు కలెక్టర్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26న ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కొత్త పథకాలకు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారందరిని ఎంపిక చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలం సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఈనెల 10న హైదరాబాద్ లోని సచివాలయంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన విషయం విదితమే. అయితే శుక్రవారం నాటి సీఎం సమావేశపు ఎజెండాతో శనివారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రెవెన్యూ కలెక్టర్ బెన్ శాలం జిల్లా అధికారులు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీ ఓలు, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని, మీ పనితీరు ప్రభుత్వ పనితీరుకు కొలమానమని అన్నారు.
ఈ నెల 26( గణతంత్ర దినోత్సవo)న ప్రభుత్వం పేదల కోసం ముఖ్యమైన పథకాలను ప్రారంభించబోతోందని, ఇందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ నాలుగు పథకాల అమలుపై జిల్లాలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభల నిర్వహణ, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించేందుకు వెంటనే సన్నాహాలు చేసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఒక్కో మండలానికి నలుగురు మండల స్థాయి అధికారులు గ్రామస్థాయిలో రెవిన్యూ, ఏ ఈ ఓ,పంచాయతీ కార్యదర్శులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఈనెల 16 నుంచి 20 వ తేదీ వరకు ఆయా గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో నాలుగు పథకాల అమలుకు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి లబ్ధిదారుల ముసాయిదా జాబితా తయారు చేయాలని ఆయన తెలిపారు.
క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈనెల 20 నుంచి 24 వ తేదీ వరకు ఆయా గ్రామాలు/ వార్డులలో ప్రజా పాలన గ్రామ సభల ను నిర్వహించి లబ్ధిదారుల ముసాయిదా జాబితాను ప్రకటించాలన్నారు. సభల సమన్వయం, నిర్వహణ కోసం ఒక మల్టీ డిస్ ప్లీనరీ బృందాన్ని క్లస్టర్ వారీగా నియమించాలన్నారు. గ్రామసభలలో ఇందిరమ్మ కమిటీలను భాగస్వామం చేయాలని, గ్రామ సభలలో ఏమైనా అభ్యంతరాలు వస్తే స్వీకరించి, విచారణ అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు.
ఇదే సమయంలో అర్హులైన లబ్ధిదారుల డాటా ఎంట్రీ చేసి జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇవ్వాలని ఆయన తెలిపారు. రైతు భరోసా సహాయం ఎకరాకు రూ.12 వేలు పెంచబడిందని, భూభారతి (ధరణి)లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందుతుందన్నారు.
వ్యవసాయ యోగం కానీ భూములను రైతు భరోసా నుండి తొలగించాలని అధికారులకు సూచించారు. రైతు భరోసా పథకం ఈనెల 26న అమలు చేయబడుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి రెండు విడతలుగా (ఒక్కో విడత రూపాయల 6000 చొప్పున) సంవత్సరానికి 12 వేలు ఇవ్వడం జరుగుతుందని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలై ఉండి, ఉపాధి హామీ పథకం కింద 2023 -2024 సంవత్సరానికి కనీసం 20 రోజులైనా పనిచేసిన వారు ఈ పథకానికి అర్హులని ఆయన పేర్కొన్నారు.
కుల గణన సర్వే ఆధారంగా తయారుచేసిన రేషన్ కార్డు లేని కుటుంబాల జాబితా క్షేత్రస్థాయి పరిశీలనకు మండల స్థాయిలో ఎంపీడీవోలు పట్టణ స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు ప్రక్రియకు బాధ్యులని, ఆ తర్వాత జిల్లాస్థాయిలో తాను(రెవెన్యూ అదనపు కలెక్టర్), జిల్లా సివిల్ సప్లై అధికారి పర్యవేక్షకులుగా ఉంటామని తెలిపారు. ముసాయిదా జాబితాను గ్రామసభ/ వార్డు సభలో ప్రదర్శించి చర్చించిన తర్వాత ఆమోదిస్తారని, ఆమోదించిన లబ్ధిదారుల జాబితాను మండల /మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్ లో నమోదు చేసి జిల్లా కలెక్టర్/ జిహెచ్ఎంసి కమిషనర్ కు పంపించాల్సి ఉంటుందన్నారు.
ఆ జాబితా ను కలెక్టర్/జీహెచ్ఎంసి కమిషనర్ పరిశీలించి సంతృప్తి చెందితే సీసీఎస్ లాగిన్ కు పంపుతారని, ఫైనల్ లిస్ట్ ప్రకారం సిసిఎస్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారని ఆయన తెలిపారు. అయితే రేషన్ కార్డు లలో సభ్యుల చేర్పులు, తొలగింపులు కూడా చేయబడతాయన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల కొరకు ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకున్న వారిలో దారిద్ర రేఖకు దిగువన ఉండి, ఇంటి నిర్మాణ స్థలం కలిగి ఉన్నవారు, అద్దె నివాసంలో ఉండేవారు అర్హులని, ఆర్ సి సి, ఇటుక గోడలు లేకుండా రేకుల షెడ్డు, గుడిసెలు ఉన్నవారికి, యువ వితంతువులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు, పారిశుద్ధ కార్మికులు, వికలాంగులకు ఈ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.
సొంత స్థలాలు లేని వాళ్ళకు కూడా ఇండ్లు కేటాయించబడతాయని, లబ్ధిదారుల ఎంపిక ఈ నెల 26 న పూర్తవుతుందన్నారు. పై కొత్త పథకాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు జాబితా తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల, ఆర్డీవో రామచంద్రనాయక్, జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి, డిఆర్డిఓ మొగులప్ప, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, డిపిఓ కృష్ణ, ఇతర జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.









