District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..!
సూర్యాపేట, మనసాక్షి :
అక్టోబర్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో 2025- 26 ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పై సన్నద్ధత సమావేశాన్ని నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ కు సంబంధించి గ్రేడ్-ఏ ధాన్యానికి క్వీన్తాలుకు 2,389 /-రూపాయలు, సాధారణ రకానికి 2369/- రూపాయలు మద్దతు ధరను ప్రకటించిందని, సన్నరకం ధాన్యానికి క్వీన్తలుకు 500 /-రూపాయలు అదనంగా బోనస్ ను ప్రకటించినట్లు వెల్లడించారు.
?ఈ సంవత్సరం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పది లక్షల 30 వేల 868 మెట్రిక్ టన్నుల దాన్యం ఉత్పత్తి రాగలదని అంచనా వేయడం జరిగిందని ,ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 430880 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనేందుకు ప్రణాళిక రూపొందించాలని వివిధ ప్రభుత్వ ఏజెన్సీలను ఆయన ఆదేశించారు. తక్కిన ధాన్యాన్ని మిల్లర్లు, ట్రేడర్ల ద్వారా కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అక్టోబర్ 20 నుంచి ధాన్యం వచ్చేందుకు ఆస్కారం ఉన్నందున అక్టోబర్ మొదటి వారంలోనే జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన 336 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఐకెపి, పిఎసిఎస్, సివిల్ సప్లై తదితర శాఖల అధికారులను ఆదేశించారు.
గత సంవత్సరం ఖరీఫ్ లో జిల్లాలో 1,18,681 మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని 107,501 మెట్రిక్ టన్నుల దొడ్డు దాన్యాన్ని మొత్తం రెండు లక్షల ఇరవై ఆరువేల 182 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, రబిలో 337 747 మె. టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ధాన్యం కొనుగోలుకు కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, మండలాల వారిగా వచ్చే ధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయాలన్నారు. సన్నధాన్యానికి, దొడ్డు ధాన్యానికి వేరు వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఏ గ్రామంలో ఏ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారో స్పష్టంగా తెలియజేస్తూ ముందే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.
గత సంవత్సరం కన్నా తక్కువగా కొనుగోలు కేంద్రాలు ఉండడానికి వీలులేదని ,ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయమై వెంటనే డి ఆర్ డి ఓ ,డి సి ఓ, జిల్లా వ్యవసాయ అధికారి, మెప్మా అధికారులు తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయా కేంద్రాలలో ఏర్పాట్ల పై సమీక్షించాలని చెప్పారు. జిల్లా వ్యవసాయ అధికారి ఆయా మండలాలు ,గ్రామాల వారీగా వచ్చే దాన్యంపై ప్రణాళిక రూపొందించాలన్నారు.
గతంలో తప్పు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు ఎట్టి పరిస్థితులలో ఈ ఖరీఫ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేటాయించవద్దని ఆదేశించారు .ధాన్యం కొనుగోలులో ఎవరైనా తప్పు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లు, దాన్యం శుభ్రపరిచే యంత్రాలు, తూకం వేసే యంత్రాలు, గన్ని బ్యాగులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
ఈ సంవత్సరం కోటి 77 లక్షల 2,000 గన్ని బ్యాగులు అవసరం కాగా, గోడౌన్లలో అందుబాటులో ఉన్న గన్ని బ్యాగులు వాడినవి కాకుండా మొత్తం 43 లక్షల 10610 గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, ఇంకా 64 లక్షల 61 390 గన్ని బ్యాగులు అవసరం ఉన్నాయని అధికారులు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ధాన్యం రవాణాకు ఎలాంటి సమస్య రాకుండా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను వెహికల్ మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సెల్ లో ట్రాన్స్పోర్ట్ ,పౌరసరఫర, జిల్లా మేనేజర్ ట్రాన్స్పోర్ట్ కాంటాక్ట్ తో సహా అందరు ఉండేలా ఏర్పాటు చేసి ప్రతిరోజు ఏ వాహనం ఎక్కడ వెళ్తున్నది మానిటర్ చేయాలని, ప్రతిరోజు తనకు వివరాలను పంపించాలని ఆదేశించారు.
రైతులు నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా ముందే అవగాహన కల్పించాలని చెప్పారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామరావు మాట్లాడుతూ మిల్లర్లు 2025- 26 ధాన్యం కొనుగోలు సందర్భంగా బ్యాంకు గ్యారంటీలను తప్పనిసరిగా ముందే ఇవ్వాలని అన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు అవసరమైన మౌలిక సదుపాయాలను ముందే సిద్ధం చేసుకుని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, ఒకసారి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత పూర్తి బాధ్యత ఆ కొనుగోలు కేంద్రం ఇన్చార్జిదేనని దీనిని దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడిసిపోకుండా, ఇతర ఇబ్బందులు కాకుండా కొనుగోలు కేంద్రం ఇన్చార్జి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో 2025-26 సంవత్సరానికి గాను పత్తి కొనుగోలు పై సమీక్షించారు.ఈ సంవత్సరం 83927 క్వింటాళ్ల పత్తి కొనుగోలుకు రానుందని,ప్రభుత్వం పత్తికి క్వింటాలు కు 8110/- రూపాయల మద్దతు ధర ప్రకటించిందని,జిల్లాలో 6 కోనుగోలు కేంద్రాలు ఉన్నాయని,గత సంవత్సరం 3033689 క్వింటాళ్ల కొనుగోలు చేశామని సి సి ఐ అధికారి, మార్కెటింగ్ అధికారులు కలెక్టర్ కు వివరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ పత్తి రాకను బట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్లాట్ బుకింగ్ ప్రకారం షెడ్యూల్ తయారు చేయాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మార్కెటింగ్ అధికారులు సమావేశాన్ని నిర్వహించి షెడ్యూల్ రూపొందించాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిన్నింగ్ మిల్లులో ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
పౌరసరఫరాల జిల్లా అధికారి మోహన్ బాబు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాము, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డిఆర్డిఓ అప్పారావు, జిల్లా కోపరేటివ్ అధికారి పద్మ , జిల్లా మార్కెటింగ్ అధికారి సతీష్, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వి .మధు, లీగల్ మెట్రోలజీ అధికారి చిట్టిబాబు, ట్రాన్స్పోర్ట్ అధికారులు ప్రకాష్ రెడ్డి, ఆదిత్య తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు .









