Nalgonda : నల్గొండ జిల్లా గువ్వలగుట్ట అడవుల్లో ఉద్రిక్తత.. ఫారెస్ట్ అధికారులపై దాడి..!

Nalgonda : నల్గొండ జిల్లా గువ్వలగుట్ట అడవుల్లో ఉద్రిక్తత.. ఫారెస్ట్ అధికారులపై దాడి..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా పోడు భూముల సమస్య నల్గొండ జిల్లాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అడవి భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో వాటిని తొలగించడానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారుల బృందంపై గిరిజనులు తిరగబడ్డారు. చందంపేట మండలం గువ్వలగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘర్షణలో ఏడుగురు ఫారెస్ట్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
అటవీ భూమిలోకి చొచ్చుకువచ్చి సాగు చేస్తున్నారనే సమాచారంతో ఫారెస్ట్ రేంజ్ అధికారి (ఎఫ్ ఆర్ వో) నేతృత్వంలో అధికారుల బృందం గువ్వలగుట్ట అడవుల్లోకి వెళ్లింది. ఫారెస్ట్ అధికారులు భూమిని ఖాళీ చేయమని కోరగా తమకు పోడు హక్కులు ఉన్నాయని ఆ భూమి తమదేనని గిరిజనులు వాదించారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వాగ్వాదం అదుపు తప్పడంతో గిరిజనులు ఆవేశంతో వచ్చి కర్రలు,రాళ్లతో ఫారెస్ట్ అధికారుల బృందంపై ఒక్కసారిగా దాడి చేశారు.
ఏడుగురు సిబ్బందికి గాయాలు
ఈ దాడిలో ఏడుగురు ఫారెస్ట్ సిబ్బంది గాయపడ్డారు. వారిని వెంటనే దేవరకొండ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన ఫారెస్ట్ సిబ్బందిలో
మొహమ్మద్ ఖజా, మోహిత్ కృష్ణ,
విష్ణు, సుమన్, కిరణ్ కుమార్, శ్రీనివాస్ కుమార్, చంద్రయ్య ఉన్నారు.
కేసు నమోదు :
ఘర్షణ సమాచారం అందుకున్న చందంపేట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన అధికారుల ఫిర్యాదు మేరకు గిరిజనులపై కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
నల్గొండ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంది.
గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ( ఆర్వో ఎఫ్ ఆర్ పట్టాలు) అందకపోవడం, అటవీ శాఖ వాటిని ‘ఆక్రమణలు’ అని వాదించడంతో ఇటువంటి ఉద్రిక్తతలు తరచూ తలెత్తుతున్నాయి.
MOST READ :









