Karimnagar : ఏక కాలంలో నాకాబందీ.. వరంగా వాహనాల తనిఖీలు..!

Karimnagar : ఏక కాలంలో నాకాబందీ.. వరంగా వాహనాల తనిఖీలు..!
కరీంనగర్ బ్యూరో, మనసాక్షి :
నేరాల నియంత్రణ, అనుమానితుల కదలికలపై నిఘా, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం రాత్రి విస్తృత నాకాబందీ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మూడు డివిజన్ల పరిధిలో ఏకకాలంలో వాహన తనిఖీలు చేపట్టారు.
కరీంనగర్ టౌన్, కరీంనగర్ రూరల్, హుజూరాబాద్ డివిజన్లలోని ప్రధాన కూడళ్లు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, సున్నిత ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు ఏసీపీలు, 15 మంది సీఐలు, 27 మంది ఎస్సైలు, 54 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 130 మంది కానిస్టేబుళ్లు, ట్రాఫిక్ విభాగానికి చెందిన ఆరుగురు సిబ్బంది, ఎస్‌ఏటీకి చెందిన ఆరుగురు ఎస్సైలు, 18 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
కరీంనగర్ టౌన్‌లో ఎన్టీఆర్ జంక్షన్, బోట్ జంక్షన్, బస్టాండ్, గీతాభవన్ సెంటర్, పద్మానగర్ జంక్షన్, ఆదర్శ్‌నగర్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ రూరల్ పరిధిలో బొమ్మకల్, తీగలగుట్టపల్లి, రేకుర్తి, అలుగునూర్, చింతకుంట, మానకొండూర్, గంగాధర తదితర ప్రాంతాల్లో, హుజూరాబాద్ డివిజన్‌లో హుజూరాబాద్, పరకాల క్రాస్‌రోడ్, కేశవపట్నం, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక తదితర ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలతో పాటు అనుమానాస్పద వాహనాలను ఆపి వాహన పత్రాలు, నంబర్ ప్లేట్లు, డ్రైవింగ్ లైసెన్సులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అక్రమ రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే తనిఖీల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.
ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని, పోలీసుల తనిఖీలకు ప్రజలు సహకరించాలని కోరారు.









