కాంట్రాక్టర్ల కోసం రైతాంగాన్ని బలి చేయవద్దు.. మూసి నీటి వృధాను నిలిపివేయాలి
కేతేపల్లి మండలం బొప్పారం గ్రామం వద్దగల మూసి ప్రాజెక్టును డ్యాం పై సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చింతపల్లి లూర్దు మారయ్య అధ్యక్షతన సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

కాంట్రాక్టర్ల కోసం రైతాంగాన్ని బలి చేయవద్దు.. మూసి నీటి వృధాను నిలిపివేయాలి
(కేతేపల్లి – రామ్మూర్తి )
కేతేపల్లి మండలం బొప్పారం గ్రామం వద్దగల మూసి ప్రాజెక్టును డ్యాం పై సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చింతపల్లి లూర్దు మారయ్య అధ్యక్షతన సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ ఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ మూసి ప్రాజెక్టులో రబి ,ఖరీఫ్ , రెండు సీజన్లకు సరిపడా నీటి నిల్వ ఉన్న కూడా ప్రభుత్వం గత జులైలో నీటిని 610 ఫీట్లకు తగ్గించి మరమత్ పనులు చేయించాలని జీవో విడుదల చేసిందని, దానికి అనుగుణంగా ప్రాజెక్ట్ అధికారులు కుడి,ఎడమ కాలువల ద్వారా నీటిని వృధాగా వదులుతున్నారని ఆయన విమర్శించారు.
వరి పొలాలు కోతకు సిద్ధమై ఉన్నా కూడా అవసరానికి మించి అధికంగా నీటిని వదులుతున్నారని, చివరి విడత అక్టోబర్ 4వ తారీఖు వరకు నీటి విడుదల నిలిపివేయవలసి ఉండగా ఈ రోజు వరకు కూడా కుడి, ఎడమ రెండు కాలువలకు నీటిని అధికంగా వదులుతున్నారని ఆయన అన్నారు. దీంతో ఆయకట్టు రైతాంగం రబీ పంటకు నీరు అందదని, తమ నోటికాడి బువ్వ పోతుందని అంత ఆందోళన గురవుతున్నారని, ఇప్పటివరకు వృధాగా సుమారు ఒక టీఎంసీ నీటిని విడుదల చేశారని ఆయన తెలిపారు.
ఒక్క టీఎంసీ అంటే సుమారు పదివేల ఎకరాలకు సరిపడా నీటిని వృధాగా వదిలారని, కాంట్రాక్టర్ల లాభాపేక్ష కోసం రైతాంగాన్ని బలి చేయవద్దని అయన అన్నారు. వెంటనే వృధాగా వెళుతున్న నీటిని బందు చేయించి రబి సీజన్ రైతులకి సరిపడా నీటి నిల్వను ఉంచాలని అయన డిమాండ్ చేశారు. యాసంగి పంట పూర్తి అయిన తర్వాతనే పూడికతీత, ఇతర మరమ్మతు పనులను చేపట్టాలని అయన అన్నారు.
మూసిప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని గతంలో నాయకులు చేసిన వాగ్దానాలు నీటి మూటగానే మిగిలిపోయాయని ఆయన విమర్శించారు. జిల్లాలో రెండవ పెద్ద ప్రాజెక్టు అయినటు వంటి మూసిని తగిన నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్ది, స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనిఅయన డిమాండ్ చేశారు. మూసి ప్రాజెక్టు దగ్గర నుండి కేతెపల్లి మండల కేంద్రంలో గల ఎన్ హెచ్ 65 వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని అయన డిమాండ్ చేశారు.
ధర్నా నుద్దేశించి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల మాట్లాడుతూ మూసి ప్రాజెక్టు నిరాదరణకు గురి అవుతోందని, పాలకులకు ప్రాజెక్టులోని ఇసుక కాంట్రాక్టల మీద ఉన్న శ్రద్ధ ప్రాజెక్టు అభివృద్ధి చేయడంలో లేదని అన్నారు. కుడి ఎడమ కాలువల వెంట ఉన్నటువంటి క్వాటర్స్ శిధిలావస్థలో ఉన్నవని, వాటిని ఆధునికరించాలని, ప్రాజెక్టుపై సిబ్బంది కొరత కూడా ఉన్నదని, తగిన సిబ్బందిని నియమించి సిబ్బంది కొరత సమస్యను కూడా పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.
కేతేపల్లి మండల సిపిఎం పార్టీ కార్యదర్శి చింతపల్లి లార్దూమారయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు, చెరుకు సత్తయ్య, గుండ గాని భాగ్యమ్మ, జడ వెంకన్న, సుంకరి సత్తయ్య, నీలం సైదులు, టంగుటూరి వెంకన్న, జానయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.








