రగ్బీలో సత్తా చాటిన గిరి జగదీశ్
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం ఎస్.వెంకటాపురం గ్రామానికి చెందిన గిరి జగదీశ్ రగ్బీ క్రీడలో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్ సాధించాడు.

రగ్బీలో సత్తా చాటిన గిరి జగదీశ్
అండర్–14 రాష్ట్రస్థాయి పోటీల్లో రెండో ర్యాంక్
(గుర్రంపోడు – యాలాద్రి , మన సాక్షి )
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం ఎస్.వెంకటాపురం గ్రామానికి చెందిన గిరి జగదీశ్ రగ్బీ క్రీడలో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం కొలిముకుందులపాడు గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న జగదీశ్, చదువుతో పాటు క్రీడలపై ఉన్న ఆసక్తితో అండర్–14 రగ్బీ టోర్నమెంట్‌లో పాల్గొని ఈ ఘనత సాధించాడు.
2026–27 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్రస్థాయి పోటీల్లో గ్రామీణ ప్రాంతానికి చెందిన జగదీశ్ ద్వితీయ స్థానంలో నిలవడం పట్ల గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. గుర్రంపోడు మండలానికే గర్వకారణమని వారు కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్.వెంకటాపురం గ్రామ మాజీ సర్పంచ్ బచ్చనబోయిన శ్రీనివాసు గిరి జగదీశ్‌ను ప్రత్యేకంగా అభినందించి, అతడికి ఆర్థిక లే,ప్రోత్సాహాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల్లో ఎంతోమంది ప్రతిభావంతులు ఉంటారని, యువత చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. గిరి జగదీశ్ సాధించిన ఈ విజయం గ్రామంలోని ఇతర యువతకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుందని, అతడిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు క్రీడల్లో ముందుకు రావాలని శ్రీనివాసు పిలుపునిచ్చారు









