Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : ఎమ్మెల్యే బిఎల్ఆర్ సీరియస్ హెచ్చరిక.. పార్టీ లైన్ దాటితే వేటు..!

మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయదశమి (దసరా) వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Miryalaguda : ఎమ్మెల్యే బిఎల్ఆర్ సీరియస్ హెచ్చరిక.. పార్టీ లైన్ దాటితే వేటు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయదశమి (దసరా) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు… పార్టీ శ్రేణులకు స్వీట్లు తినిపించి పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం, పార్టీ, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి విజయానికి కృషి చేయాలి

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి గారి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు వార్డుల వారీగా సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు.

మిర్యాలగూడకు మరో 1,700 ఇందిరమ్మ ఇళ్లు

నియోజకవర్గంలో ఇప్పటికే 3,000 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, మిర్యాలగూడ పట్టణానికి త్వరలో మరో 1,700 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. తెలంగాణలో ఉపగ్రహ సర్వే ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు.

దీపావళి నాటికి పట్టణంలోని ప్రతి వార్డుకు 20 నుంచి 25 ఇళ్ల చొప్పున కేటాయించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన పేదలను గుర్తించి, సంబంధిత కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్, టౌన్ ప్రెసిడెంట్ సమక్షంలో పారదర్శకంగా ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దామరచర్లలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన

దామరచర్ల మండలంలో తొలి విడతగా 150 ఇళ్లకు సంబంధించి, 2BHK ఇళ్ల వద్ద శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

సాగునీటి వినియోగంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు సూచించారు. చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని కోరారు.

అదేవిధంగా వేసవిలో తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సూచించారు.

దీపావళి నాటికి మిర్యాలగూడ ఫ్లైఓవర్ పనులు ప్రారంభం

మిర్యాలగూడ పట్టణ అభివృద్ధికి కీలకమైన ఫ్లైఓవర్ నిర్మాణ పనులను దీపావళి నాటికి రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి చర్యలు

మిర్యాలగూడలోని పాత కాంగ్రెస్ పార్టీ భవనాన్ని తొలగించి, పార్టీ కార్యకలాపాలకు అనువుగా కార్యాలయం, పార్కింగ్ సదుపాయం, సమావేశ మందిరంతో కూడిన నూతన భవనాన్ని త్వరలో నిర్మించుకుందామని ఎమ్మెల్యే అన్నారు. అలాగే సాగర్ రోడ్డులో ఉన్న ప్రముఖుల విగ్రహాలను అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఎన్‌ఎస్‌పీ గ్రౌండ్‌లోకి మార్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పట్టణ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం

మిర్యాలగూడ పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు, వీధి దీపాలు, ట్రాఫిక్ డివైడర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

పార్టీ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి

పార్టీ నిర్ణయాలు, ప్రోటోకాల్‌ను ప్రతి నాయకుడు, ప్రజాప్రతినిధి తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినా, ప్రోటోకాల్‌ను అతిక్రమించినా సంబంధిత విషయాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకునేలా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ, మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు