పాల్వాయిలో ‘ఖేత్ బచావో’ సదస్సు
రైతులు నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుని సాగు చేయాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు (ఏడీఏ) సరిత సూచించారు. ‘ఖేత్ బచావో’ అభియాన్‌లో భాగంగా శుక్రవారం పాల్వాయి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

పాల్వాయిలో ‘ఖేత్ బచావో’ సదస్సు
నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటలు సాగు చేయాలి
గుర్రంపోడు – యాలాద్రి, మన సాక్షి :
రైతులు నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుని సాగు చేయాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు (ఏడీఏ) సరిత సూచించారు. ‘ఖేత్ బచావో’ అభియాన్‌లో భాగంగా శుక్రవారం పాల్వాయి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగుకు ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు. మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ) మాధవరెడ్డి మాట్లాడుతూ.. రైతులు నేల పరీక్షల ఆధారంగానే సమతుల్య ఎరువులను వినియోగించాలని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ భూసారాన్ని పరిరక్షించుకోవాలని కోరారు.
అనంతరం వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) భగీరథ మాట్లాడుతూ.. పంట కోత తర్వాత మిగిలిన అవశేషాలను తగలబెట్టకుండా నేలలోనే కలిపి దున్నాలని, వర్షపు నీటిని సంరక్షిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించాలని రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ ప్రసాద్, గ్రామ ప్రజాప్రతినిధులు మరియు స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.









