ఫోన్ పే తో డబ్బులు తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండండి, మీకూ ఇలా జరగవచ్చు..!
ఫోన్ పే తో డబ్బులు తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండండి, మీకూ ఇలా జరగవచ్చు..!
మన సాక్షి , వెబ్ డేస్క్:
ఇటీవల కాలంలో యూపీఐ పేమెంట్స్ ద్వారానే చెల్లింపులు కొనసాగుతున్నాయి. నగదు చెల్లింపుల మాటే లేకుండా పోయింది. దాంతో సైబర్ నేరగాళ్లు తక్కువ సమయంలో డబ్బు సంపాదించేందుకుగాను అడ్డదారులు తొక్కుతున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నకిలీ ఫోన్ పే యాప్ తో డబ్బులు చెల్లించినట్లు చూపించి పెట్రోల్ బంకుల్లో మోసం చేస్తున్న ముఠాను నిర్మల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కూనేపల్లికి చెందిన భరత్, కిషన్ తండా చెందిన సాయి కిరణ్, రాథోడ్ అరుణ్, రాథోడ్ జీవన్ ముఠాగా ఏర్పడి నకిలీ ఫోన్ పే మోసాలకు పాల్పడుతున్నారు. భరత్ కొరియర్ బాయ్ గా పనిచేస్తుండగా మిగతా ముగ్గురు కూడా కూలీలుగా పనిచేస్తున్నారు.
వీరంతా ముఠాగా ఏర్పడి సులభమైన మార్గాల్లో తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలని భావించారు. నకిలీ ఫోన్ పే యాప్ గురించి తెలుసుకున్నారు. దాని సహాయంతో వివిధ బంకుల్లో మోసాలకు పాల్పడ్డారు. దాదాపు రెండేళ్లుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ సంవత్సరం జూన్ 2న నిర్మల్ పట్టణంలోని పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకున్నారు. ముందుగా 200 రూపాయలు సాధారణ ఫోన్ పే తో డబ్బులు పంపించి అక్కడున్నవారిని నమ్మించారు. ఆ తర్వాత నగదు అవసరం ఉందని చెప్పి బంక్ సిబ్బందికి నకిలీ ఫోన్ పే యాప్ సహాయంతో ఎనిమిది వేల రూపాయలు పంపించినట్లు నమ్మించి అతడి నుంచి నగదు తీసుకొని వెళ్ళిపోయారు. అదేవిధంగా జూన్ 28న నిర్మల్ లోని కావేరి పెట్రోల్ బంకులో అదే తరహాలో మరో ఎనిమిది వేలు తీసుకున్నారు. ఇలా వచ్చిన డబ్బులు అంతా నలుగురు ముఠా కలిసి పంచుకునేవారు.
మోసపోయిన బాధితులు నిర్మల్ పట్టణ పోలీసులకు సమాచారం అందజేశారు. దాంతో పోలీసులు తనిఖీల్లో ఈ నలుగురు అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని విచారించగా విషయం బయటపడింది. నిజామాబాద్, కామారెడ్డి రామాయంపేట ప్రాంతాలలో ఈ తరహా మోసాలకు వాళ్ళు రెండేళ్లుగా పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
నిందితుల నుంచి ఒక ద్విచక్ర వాహనం, నాలుగు సెల్ ఫోన్లు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఫోన్ పే యాప్ తో నగదు ఇచ్చుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడుతే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి :
Operation Muskan : ఆపరేషన్ ముస్కాన్ తో 21 మందికి విముక్తి..!
మిర్యాలగూడ : ప్రేమ పేరుతో వేధించి యువతి ఆత్మహత్యకు కారకులైన వారు అరెస్ట్, రిమాండ్..!
Good News : ప్రయాణికులకు TGSRTC శుభవార్త.. ఇకపై తొలగనున్న కష్టాలు..!









