Cyber : ఇప్పుడు సరికొత్త హైబ్రిడ్ సైబర్ మోసం.. ఎలా చేస్తారంటే.. అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ సూచన..!
సాంప్రదాయ జేబు దొంగతనాలకు ఆధునిక సైబర్ నేరాలను జోడించి అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు.

Cyber : ఇప్పుడు సరికొత్త హైబ్రిడ్ సైబర్ మోసం.. ఎలా చేస్తారంటే.. అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ సూచన..!
హైదరాబాద్, మన సాక్షి :
సాంప్రదాయ జేబు దొంగతనాలకు ఆధునిక సైబర్ నేరాలను జోడించి అమాయకుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు.
ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారే లక్ష్యంగా ఈ ముఠాలు వ్యవస్థీకృతంగా దోపిడీకి పాల్పడుతున్నట్లు మా దర్యాప్తులో వెల్లడైంది. బస్టాండ్లు, రద్దీ బస్సుల్లో ప్రయాణికులు ఫోన్ అన్‌లాక్ చేసే సమయంలో పిన్/ప్యాటర్న్ నిశితంగా గమనించి ఫోన్లను చోరీ చేస్తున్నారు.
ఒకవేళ లాక్ తెలియకపోతే.. బాధితులు కాల్ చేసినప్పుడు ‘మేము బస్సు కండక్టర్లం.. ఫోన్ ఇచ్చేస్తాం’ అంటూ లేదా ‘ఓనర్ వెరిఫికేషన్’ పేరిట మాయమాటలు చెప్పి స్క్రీన్ పాస్వర్డ్లు రాబడుతున్నారు. అనంతరం ఫోన్ గ్యాలరీ, నోట్స్ యాప్‌లలో దాచుకున్న డెబిట్ కార్డులు, ఆధార్/పాన్ వివరాలను సేకరిస్తున్నారు.
దొంగిలించిన సిమ్ కార్డు ద్వారా వచ్చే ఓటీపీలతో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్లు రీసెట్ చేసి, నిధులను ఆన్లైన్ గేమింగ్ యాప్స్, మ్యూల్ అకౌంట్లకు మళ్లించి డ్రా చేస్తున్నారు. ఈ తరహా నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ తరహా నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఫోన్ పోయినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఇచ్చేస్తామని చెప్పినా.. ఎట్టిపరిస్థితుల్లోనూ స్క్రీన్ లాక్ పిన్, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దు. ఏటీఎం కార్డులు, బ్యాంకు పాస్‌బుక్, ఆధార్/పాన్ కార్డుల ఫోటోలను ఫోన్ గ్యాలరీలో, నోట్స్‌లో ఎప్పుడూ భద్రపరచుకోవద్దు.
ఫోన్ పోయిన వెంటనే సిమ్ కార్డును, బ్యాంక్/యూపీఐ సేవలను తక్షణమే బ్లాక్ చేయించి, ceir.gov.in పోర్టల్‌లో ఫోన్‌ను బ్లాక్ చేయండి. సైబర్ మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. ముఖ్యంగా ఇంట్లోని పెద్దలకు ఈ మోసాల గురించి వివరించి అప్రమత్తం చేయండి.
SIMILAR NEWS
- Cyber : ఫోన్ కాల్ లిఫ్ట్ చేయగానే ఖాతా ఖాళీ.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి..!
- Cyber Crime : సైబర్ మోసగాళ్ల బారిన పడిన యువకుడు.. బ్యాంకు ఖాతా ఖాళీ చేసిన మోసగాళ్లు..!
- Cyber Crime : రూ.5 వేలు ఇచ్చారు.. రూ.2.9 కోట్లు కొట్టేశారు..!
- Cyber : సైబర్ మోసగాడికే చుక్కలు చూపించిన యువకుడు.. ఎలాగో అందరూ తెలుసుకోండి..!









