District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ప్రజా ప్రతినిధులు గ్రామాలలో పర్యటించాలి..!
నూతన ప్రజా ప్రతినిధులు గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.

District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ప్రజా ప్రతినిధులు గ్రామాలలో పర్యటించాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నూతన ప్రజా ప్రతినిధులు గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా, మిర్యాలగూడ లో నిర్వహించిన మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల పాటు నిర్వహించవలసిన కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం రూపొందించి పది ప్రధాన అంశాలను తీసుకొని వాటి పై అవగాహనతో పాటు, సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా, ఇప్పటివరకు ప్రభుత్వం సాధించిన అభివృద్ధి పై ప్రజలకు తెలియజేసేందుకు చేపట్టడం జరిగిందని వెల్లడించారు.
ఇందులో భాగంగా మార్చి 6 నుండి 15 వరకు అన్ని గ్రామాలు, పట్టణాలు, కార్యాలయాలలో పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టేందుకు నిర్దేశించడం జరిగిందని, అంతేకాక అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలలో ఫైళ్ల పరిష్కారం చేపట్టినట్లు తెలిపారు.
ప్రజాప్రతినిధులు గ్రామాలలో పర్యటిస్తే సమస్యలు తెలుస్తాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఎంపీడీవోలు గ్రామ వారీగా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాబితాను రూపొందించి ఏప్రిల్ 2 న నిర్వహించనున్న గ్రామసభలలో వాటిని చదివి వినిపించాలని, అదేవిధంగా ప్రభుత్వం అమలుచేసే అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను గ్రామ సభలలో, మున్సిపల్ పట్టణాలలో చర్చించాలన్నారు.
ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల ను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని, ఎల్ -3 నుండి ఎల్- 1 కు వచ్చిన కొన్ని ఇండ్ల సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నామని , ఉగాది నాటికి సామూహిక ఇందిరమ్మ గృహప్రవేశాలను చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 14 నుండి జరిగే ఎస్ ఎస్ సి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని ,జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరూ 10వ తరగతి పరీక్షలలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలన్నారు.
పశ్చిమాషియా యుద్ధ నేపథ్యంలో నెలకొన్న ఎల్పీజీ గ్యాస్ కొరతపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్ల కు ఎలాంటి కొరత లేదని, వాణిజ్య పరమైన సిలిండర్లకు మాత్రమే కొరత ఉందని అందువల్ల ప్రజలు అపోహలను నమ్మవద్దని, దళారీల మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఎల్పిజి గ్యాస్ సరఫరా విషయమై గురువారమే ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని, జిల్లాలో డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లను అక్రమంగా కమర్షియల్ కు వాడిన 16 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ ఉద్దేశాలు, మార్గదర్శకత్వాన్ని నెరవేర్చే విధంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ప్రతి ఒక్కరూ పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులందరు కలిసికట్టుగా పనిచేసి మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు నిలపాలన్నారు. మిర్యాలగూడ వాణిజ్యపరంగా ముందున్నప్పటికీ అనేక మంది పేదవారు ఉన్నారని, వారికి విద్య ,వైద్యానికి పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ తో కోరారు.
యూరియాకు సంబంధించి మండలాల వారీగా కాకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వారిగా తమకు కేటాయించాలని, వైటిపిఎస్ కు సంబంధించిన సిఎస్ఆర్ నిధులను అభివృద్ధి పనులకు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా నూతన ప్రజాప్రతినిధులు గ్రామాలు, మండలాలలో పర్యటించి సమస్యలు గుర్తించి పరిష్కరించాలని, అంతేకాక సమస్యల పరిష్కారానికి అవసరమయ్యే నిధుల అంచనాలను రూపొంది సమర్పించాలని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
ప్రజాభివృద్ధే అందరి లక్ష్యం కావాలని, నియోజకవర్గంలో తాగునీరు, విద్యుత్తు సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందరికీ విద్య, వైద్యం అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని, ప్రజా సంక్షేమాన్ని బాధ్యతగా తీసుకోవాలని, రాజకీయాల కతీతంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. రాబోయే రోజుల్లో మిర్యాలగూడ పట్టణంలో ఈఎన్టి ఆసుపత్రి, ప్రస్తుత ఆసుపత్రిని స్థాయి పెంచడం, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారం, రింగ్ రోడ్లు ఏర్పాటు, విద్య , వైద్యానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నదని, పేదలు, అట్టడుగు వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం గతం నుండి ఎన్నో. సంస్కరణలు తెచ్చిందని తెలియజేశారు.
మున్సిపల్ చైర్మన్ సుధ మాట్లాడారు.
ఈ సందర్బంగా వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ ప్రాధామ్య అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజా ప్రతినిధులకు వివరించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ కమిషనర్, జిల్లా అధికారులు హాజరయ్యారు.









