Doctorate : గౌరవ డాక్టరేట్ అందుకున్న రంగు ముత్యంరాజు గురుస్వామి..!
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక, సామాజిక సేవకులు, ఉద్యాన విస్తరణ అధికారి రంగు ముత్యంరాజు గురుస్వామి ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందుకున్నారు.

Doctorate : గౌరవ డాక్టరేట్ అందుకున్న రంగు ముత్యంరాజు గురుస్వామి..!
శాలిగౌరారం, మనసాక్షి :
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక, సామాజిక సేవకులు, ఉద్యాన విస్తరణ అధికారి రంగు ముత్యంరాజు గురుస్వామి ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందుకున్నారు. శనివారం తమిళనాడు రాష్ట్రం హోసూర్‌లో ఆసియా అంతర్జాతీయ సాంస్కృతిక అకాడమీ, ఆసియా అంతర్జాతీయ సాంస్కృతిక పరిశోధన విశ్వవిద్యాలయం యాజమాన్యం ఆయనకు ఈ గౌరవాన్ని ప్రదానం చేసింది.
ఉద్యానవనం, దైవత్వం, ఆధ్యాత్మికత మరియు సామాజిక సేవ విభాగాల్లో గత మూడు దశాబ్దాలుగా చేస్తున్న విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ డాక్టరేట్ లభించింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన రంగు సత్తయ్య గౌడ్, బుచ్చమ్మ దంపతులకు మొదటి సంతానంగా 1977 మే 9న జన్మించిన ముత్యంరాజు, చిన్నతనం నుంచే సేవాభావం అలవర్చుకున్నారు. 1994లోనే నవోదయ యువజన సంఘాన్ని స్థాపించి మిత్రులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. భారత జాతీయ విద్యార్థి సంఘంలో కూడా క్రియాశీలకంగా పనిచేశారు.
గత 25 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ, గురుస్వామిగా వేలాది మంది భక్తులకు అయ్యప్ప తత్వాన్ని బోధిస్తున్నారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభలో కీలకంగా వ్యవహరిస్తూ, దాతల సహకారంతో పేదలకు నిత్యాన్నదానం, అల్పాహార పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతులకు సేవ చేయాలనే సంకల్పంతో గత 16 సంవత్సరాలుగా ఉద్యాన శాఖలో ఉద్యాన విస్తరణ అధికారిగా పనిచేస్తూ రైతులకు విశేష సేవలు అందిస్తున్నారు. ఆధునిక పద్ధతులు, కొత్త వంగడాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
సమాజ సేవతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో 1997 నుండి పత్రికా రంగంలో జర్నలిస్టుగా నిస్వార్థంగా పనిచేస్తున్నారు. సమస్యలను వెలుగులోకి తెస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించిన ఆసియా అంతర్జాతీయ సాంస్కృతిక అకాడమీ యాజమాన్యానికి ముత్యంరాజు గురుస్వామి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు,అయ్యప్ప భక్తులు, రైతులు అభినందనలు తెలిపారు.









