Nalgonda : రైతుల ఘోస.. యూరియా కోసం తెల్లవారుజామునుంచే భారీ క్యూ..!
Nalgonda : రైతుల ఘోస.. యూరియా కోసం తెల్లవారుజామునుంచే భారీ క్యూ..!
గుర్రంపోడు, మనసాక్షి :
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలో, రైతన్నలకు యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. గత వారం, పది రోజులుగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురువడంతో యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. యూరియా బ్లాక్‌లో.. రైతన్న వీధుల్లో.. ప్రైవేట్ డీలర్లు యూరియాను విక్రయించకుండా బ్లాక్‌లో పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
గంటల తరబడి బారులు తీరుతున్న రైతులు
స్టాక్ ఉందని అధికారులు చెబుతున్నా…రైతులకు తప్పని ఇబ్బందులు, వరినాట్లు వేస్తుండడంతో పాటు పత్తికి రెండో విడతగా యూరియా తప్పనిసరిగా వేయాల్సి ఉండడంతో యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. జిల్లా అంతట అందుబాటులో ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నప్పటికీ… వాస్తవానికి సరిపోను స్టాక్ లేకపోవడంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతుల గోస చూస్తే తెలుస్తున్నది.
జిల్లాలో ఉన్న యూరియా అరకొర నిల్వలతో రైతులు వ్యవసాయ పనులు వదులుకొని అగ్రో రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు పడుతున్నారు. యూరియా కోసం రైతులు వ్యవసాయ పనులు వదులుకొని ఉదయం నుండి భారీ క్యూ లైన్లలో పడిగాపులు పడుతున్నారు.
అన్ని పనులు వదులుకొని బారులు తీరుతున్న రైతుల్లో కొందరికి మాత్రమే యూరియా దొరుకుతుందని, మిగతా రైతులు గంటల తరబడి క్యూ లైన్లలో ఉన్నా ప్రయోజనం ఉండడం లేదని యూరియా విక్రయ కేంద్రాల నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం.
ప్రైవేట్ డీలర్ల వద్దనే అధిక మొత్తంలో యూరియా నిల్వలు ఉంటున్నట్లు రైతులు చెబుతున్నారు. యూరియా నిల్వలు ఉన్నప్పటికీ నో స్టాక్ అంటూ యూరియాను బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రైతాంగానికి సరిపోను యూరియాను సమకూర్చకుండా ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తుంటే, మరోవైపు ప్రైవేట్ డీలర్లు రైతులను మోసం చేస్తున్నారు. వచ్చే యూరియా స్టాక్‌లో ఎక్కువ మొత్తంలో యూరియా నిల్వలు ప్రైవేట్ డీలర్లకే వెళ్తుండడంతో వారు బ్లాక్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
యూరియా ప్రైవేట్ డీలర్ల వద్దనే ఉండడం గమనార్హం. మెజార్టీ యూరియా నిల్వలు ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్నప్పటికీ విక్రయాలను నిలిపివేసి బ్లాక్ చేస్తూ, ఉన్న స్టాక్‌ను కూడా విక్రయించకుండా కృత్రిమ కొరతను సృష్టించే పనిలో ప్రైవేట్ డీలర్లు ఉన్నట్లు రైతులు చెప్తున్నారు. అయితే యూరియా కొరతను ఆసరాగా తీసుకుంటున్న కొందరు ప్రైవేట్ డీలర్లు బ్లాక్‌లో పెట్టి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఒక్కొ బస్తాకు రూ.270 నుండి రూ.280లకు విక్రయించాల్సి ఉండగా, కొందరు ప్రైవేట్ డీలర్లు ఒక్కొ బస్తాకు రూ.350-రూ.400ల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. పైవేట్ డీలర్లను నిఘా పెట్టాల్సిన వ్యవసాయాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
గుర్రంపోడు మండలంలో యూరియా సరిపడ లేకపోవడంతోనే ఇబ్బందులు పడుతున్నామని రైతులు తమ గోడును వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాధికారులు జిల్లా అంతటా సరిపోను యూరియా స్టాక్ ఉందని చెబుతున్నా… వారు అధికారికంగా ఇచ్చే స్టాక్ నిల్వలను చూస్తే జిల్లాలో ఎక్కడా కూడా యూరియా స్టాక్ లేదనే విషయం తెలుస్తున్నది. సరిపోను యూరియా ఉంటే రోజుల తరబడి క్యూ లైన్లలో ఎందుకు పడిగాపులు పడుతామని రైతులు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇప్పటికే కొంతమేర యూరియాను రైతులు కొనుగోలు చేశారని చెబుతున్నా…సరిపోను యూరియా లేదనే విషయం తెలుస్తున్నది. అందుబాటులో యూరియా ఉందని అధికారులు చెబుతున్న , అధికారులు రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నిప్రాంతాల్లో యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్నప్పటికీ అధికారులు మాత్రం జిల్లాలో స్టాక్ ఉందంటూ చెబుతున్నారు.
గుర్రంపోడు మండలం అగ్రో రైతు సేవ కేంద్రం వద్ద సోమవారం ఉదయం నుంచే రైతులు బారులు తీరారు. కేవలం 500 బస్తాల యూరియా మాత్రమే రావడంతో చాలామందిరైతులకు అందలేదు. పూర్తిస్థాయిలో యూరియాను అందజేయకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. గంటల తరబడి క్యూలో నిలబడినా యూరియా రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
ఉదయం నుంచే పడిగాపులు
యూరియా కోసం అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు. గుర్రంపోడు మండల కేంద్రంలోని సోమవారం అగ్రో రైతు సేవ కేంద్రం కార్యాలయం వద్ద ఉదయం నుండే రైతులు పడిగాపులు కాస్తూ, క్యూలో నిల్చున్నారు. గత పదేళ్ల కాలంలో ఎన్నడూ కూడా యూరియా కోసం ఇంత కష్టం పడలేదని రైతులు వాపోతున్నారు. కార్యాలయం తెరిచిన తర్వాత ఒక్కొ రైతుకు ఒక యూరియా బస్తా ఇవ్వడంతో అవి ఏ మాత్రం పంటకు సరిపోవడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురవడంతో పంటలకు యూరియా వేసేందుకు రైతులు సిద్ధమవుతున్న సమయంలో యూరియా కొరత రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
MOST READ :
-
Urea : రైతులకు టోకెన్లు.. యూరియా పక్క దారి..!
-
Suryapet : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి..!
-
TG News : తెలంగాణలో రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించిన అల్ట్రావయొలెట్..!
-
Ramagundam : నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ గా మారుతి ప్రసాద్.. ఎవరంటే..!
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన అవినీతి అధికారి..!
-
Nalgonda : నల్గొండలో దారుణ హత్య..!









