Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. రూ.5 కోట్లు అప్పు ఇస్తామని నమ్మించి, 60 లక్షలతో పరార్..!
Miryalaguda : మిర్యాలగూడలో ఘరానా మోసం.. రూ.5 కోట్లు అప్పు ఇస్తామని నమ్మించి, 60 లక్షలతో పరార్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం కలిగించే ఘరానా మోసం వెలుగు చూసింది. ఐదు కోట్ల రూపాయలు అప్పు ఇస్తామని చెప్పి నమ్మబలికి 60 లక్షల రూపాయలతో పరారైన సంఘటన చోటుచేసుకుంది. అతి చాకచక్యంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు చేదించారు.
బుదవారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాదులోని చందానగర్ కు చెందిన సమీర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. అతడు హైదరాబాద్ తో పాటు నిజామాబాద్ లో కూడా వ్యాపారం చేస్తాడు.
ఆయనకు అత్యవసరంగా 5 కోట్ల రూపాయలు అవసరమై శ్రీకాంత్ అనే మధ్యవర్తి ద్వారా మిర్యాలగూడ పట్టణం గాంధీనగర్ కు చెందిన కండెల గణేష్, మల్లికార్జునులను సంప్రదించారు. వారు ఐదు కోట్ల రూపాయలు అప్పుగా ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకొని ముందుగా జులై 31 వ తేదీన అబ్దుల్ సమీర్ ను నమ్మించడానికి 90 లక్షల రూపాయలు ఇచ్చి వారి వద్ద నుండి బ్లాక్ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఇంటి కాగితాలు తీసుకున్నారు.
ఆ తర్వాత సమీర్ ఐదు కోట్ల రూపాయల గురించి గణేష్, మల్లికార్జునులను సంప్రదించగా ఈనెల 5వ తేదీన సోమవారం తాము మొదటగా ఇచ్చిన 90 లక్షల రూపాయలు తీసుకొని వాటితో పాటు తాము ఇవ్వబోయే ఐదు కోట్ల రూపాయల అప్పుకు వడ్డీగా మరో 60 లక్షల రూపాయలు తీసుకొని మిర్యాలగూడకు రావాల్సిందిగా చెప్పారు.
దాంతో సమీర్ తన వ్యాపార భాగస్వాములతో కలిసి ఈనెల 6వ తేదీన సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు మిర్యాలగూడ గాంధీ నగర్ లో ఉన్న వీరన్న ఇంటికి వచ్చారు. సమీర్ తో పాటు మొదట నిందితులు అప్పుగా ఇచ్చిన 90 లక్షల రూపాయలు మరియు ఇవ్వబోయే ఐదు కోట్ల రూపాయలకు వడ్డీగా 60 లక్షల రూపాయలు విడివిడిగా మొత్తం ఒక కోటి 50 లక్షలతో వచ్చారు.
ముందుగా పథకం ప్రకారం గాంధీ నగర్ లో వీరన్న ఇంటి వద్ద ఉన్న నిందితులు గణేష్, మల్లికార్జున్, విజయ్, రాజు, గంగమ్మ, అనుపమ, వెంకటమ్మ, వీరమ్మ లు సమీర్ తో పాటు అతని స్నేహితులతో మాట్లాడి మొదటి వారి వద్ద నుండి తాము వడ్డీగా ఇచ్చిన 90 లక్షల రూపాయలు తీసుకొని వారి వద్ద నుంచి తీసుకున్న చెక్కులు ప్రామిసరీ నోట్లు ఇంటి కాగితాలు తిరిగి ఇచ్చేశారు.
ఆ తర్వాత సమీర్ అతని స్నేహితులు తమకు అప్పుగా ఇస్తానన్న ఐదు కోట్ల రూపాయల గురించి అడగగా నిందితులు ఐదు కోట్లకు ముందుగా ఇవ్వాల్సిన 60 లక్షల రూపాయల వడ్డీని ఇవ్వాల్సిందని కోరారు. వడ్డీగా తీసుకొచ్చిన 60 లక్షల రూపాయలు చూపెడుతుండగా హఠాత్తుగా నిందితులు కండెల గణేష్, మల్లికార్జున్, విజయ్, రాజు, మిగతా వారితో కలిసి దాడి చేసి 60 లక్షల రూపాయల బ్యాగుతో పారిపోయారు.
ఆ తర్వాత సమీర్ అతని స్నేహితులు చేరుకొని వెంబడించే ప్రయత్నం చేయగా మిగతా నిందితులు గంగమ్మ, అనుపమ, వీరమ్మ, వెంకటమ్మలు కూడా రాళ్లతో దాడి చేసి వాళ్లు కూడా పారిపోయారు.
కాగా నేరానికి సంబంధించిన మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్ఐ శేఖర్ ఆధ్వర్యంలో నేరం జరిగిన స్థలానికి వెళ్లి వెంటనే డిఎస్పి రాజశేఖర్ రాజు ఆదేశాల మేరకు టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున, రూరల్ ఎస్సై నరేష్ , సిబ్బంది సహకారంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మంగళవారం ఉదయం 10:30 గంటలకు నిందితులలో అనుపమ, వీరమ్మ, గంగమ్మలను పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి 60 లక్షల రూపాయలతో స్వాధీనం చేసుకున్నారు.
నిందితులలో గణేష్ మల్లికార్జున్, విజయ్, రాజు, వీరన్న, గంగమ్మ లు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
మిర్యాలగూడలో సంచలనం కలిగించిన భారీ నేరాన్ని డిఎస్పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో 24 గంటల్లోనే మిర్యాలగూడ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్ఐ శేఖర్, సిబ్బంది, టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున, ఎస్ ఐ నరేష్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.
ఇవి కూడా చదవండి :
Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!










