Nalgonda : అధిక వడ్డీ ఆశచూపి రూ.100 కోట్లు వసూలు.. అప్పు తీర్చకపోవడంతో వడ్డీ వ్యాపారి ఇంటికి నిప్పు పెట్టిన బాధితులు..!

Nalgonda : అధిక వడ్డీ ఆశచూపి రూ.100 కోట్లు వసూలు.. అప్పు తీర్చకపోవడంతో వడ్డీ వ్యాపారి ఇంటికి నిప్పు పెట్టిన బాధితులు..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని పెద్ద అడిశర్లపల్లి మండలం, వద్దిపట్ల గ్రామం అసాధారణమైన ఆందోళనకు వేదికైంది. అధిక వడ్డీ ఆశ చూపి సుమారు ₹100 కోట్లకు పైగా ప్రజల నుండి వసూలు చేసి మోసం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వడ్డీ వ్యాపారి బాలాజీ నాయక్ పై బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న నాయక్‌కు చెందిన విలాసవంతమైన భవనానికి బాధితులు నిప్పుపెట్టారు.
ఆత్మహత్యాయత్నం: ఉద్రిక్తతకు దారితీసిన ఘటన
బాలాజీ నాయక్ మోసం కారణంగా డబ్బులు పోగొట్టుకున్న బాధితుల్లో ఒకరైన వద్దిపట్లకు చెందిన రామావత్ సరియా నాయక్ (37) తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సరియా నాయక్ ఒక్కరే దాదాపు రూ. 80 లక్షలు నాయక్‌కు ఇచ్చారని తెలుస్తోంది. ఈ మోసాన్ని తట్టుకోలేక అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చావుబతుకుల్లో పోరాడుతున్నారు.
ఈ హృదయ విదారక ఘటనతో ఆగ్రహావేశాలకు లోనైన సరియా నాయక్ కుటుంబ సభ్యులు, బాలాజీ నాయక్‌తో మోసపోయిన ఇతర బాధితులు ఒక్కటై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. వద్దిపట్లలోని బాలాజీ నాయక్‌కు చెందిన భవనాన్ని బాధితులు ఒక్కసారిగా ముట్టడించారు.
తొలుత ఇంట్లోని సామగ్రి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత తమ ఆగ్రహానికి ప్రతీకగా ఆ విలాసవంతమైన భవనానికి నిప్పుపెట్టారు. అగ్నికీలలు ఎగసిపడడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
అధికారుల నిర్లక్ష్యంపై బాధితుల ఆగ్రహం
ఈ భారీ మోసంపై బాధితులు అధికారుల తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీ వ్యాపారి బాలాజీ నాయక్ మోసపూరిత కార్యకలాపాలపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ఈ దారుణ పరిస్థితి సరియా నాయక్ ఆత్మహత్యాయత్నం చోటుచేసుకునేవి కాదని వారు వాపోతున్నారు.
బాలాజీ నాయక్ పరారీలో ఉండగా కోట్లు పోగొట్టుకున్న బాధితుల ఆందోళన వారిలో ఒకరి ఆత్మహత్యాయత్నం ఆస్తి విధ్వంసం వంటి పరిణామాలు ఈ ఘటన తీవ్రతను తెలియజేస్తున్నాయి.
MOST READ :









