సత్తుపల్లిలో అటవీ జంతువుల వేట.. బీఆర్ఎస్ నేతల హస్తంపై సర్వత్రా చర్చ..!

సత్తుపల్లిలో అటవీ జంతువుల వేట.. బీఆర్ఎస్ నేతల హస్తంపై సర్వత్రా చర్చ..!
దమ్మపేట, మన సాక్షి:
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అటవీ జంతువుల వేట కలకలం రేపుతుంది. అటవీ శాఖ అధికారులు ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పేర్లలో ఓ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తనయుడు ఉండడం మరింత చర్చకు తవిస్తుంది. దీని వెనుక బీఆర్ఎస్ నేతలు మరింత మంది ఉన్నట్లు కూడా నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. స్థానిక నేతల హస్తం లేకుండా వేట కొనసాగదు.. అనేది అధికారులు విచారణ చేస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ చేస్తే మరింతమంది వెలుగులోకి వస్తారని స్థానికులు కూడా పేర్కొంటున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తనయుడి వివాహ విందులో దుప్పుల మాంసం వడ్డించినట్లు నెలకొన్న అనుమానాలకు చివరకు తెరలేచింది. వన్యప్రాణులను వేటాడిన ప్రధాన నిందితుడు అతడే అని దర్యాప్తులో తేలడంతో, సత్తుపల్లి అటవీశాఖ నిందితుడిగా పేర్కొంటూ అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఈ మేరకు అర్బన్ పార్క్ దుప్పుల వేట ఘటనతో వివాహ విందు దుప్పుల మాంసం సరఫరా మధ్య సంబంధం స్పష్టమైంది. ప్రాథమిక విచారణలో ఐదు దుప్పులను తుపాకులతో కాల్చి హతమార్చినట్టు నిర్ధారణ కాగా, వాటిని అతని వివాహ విందుకు తరలించి మాంసం వడ్డించిన విషయం వెలుగులోకి వచ్చింది.
విస్తృతంగా ఆహ్వానాలు ఉన్న ఈ విందుకు వన్యప్రాణుల వేటతో మాంసం సేకరించినట్టు అటవీశాఖ నిర్ధారించడంతో మాజీ ఎమ్మెల్యే తనయుడి పై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద పలు ఆరోపణలు నమోదు చేశారు.

దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు :
ఈ పరిణామానికి ముందు సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్ పరిసరాల్లో జరిగిన దుప్పుల వేట కేసులో ప్రైవేట్ ఉద్యోగి గోపికృష్ణ, రాంప్రసాద్‌లను అదుపులోకి తీసుకోవడం, వారిని రిమాండ్‌కు పంపడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తించింది. వేట జరిగిన రాత్రి ‘వారాహి’ స్టిక్కర్ ఉన్న వాహనం పార్క్‌లోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినప్పటికీ, అప్పటివరకు ఆ వాహనం యజమాని,
ప్రయాణికులు ఎవరో వెల్లడించకపోవడంతో దర్యాప్తుపై విమర్శలు వినిపించాయి. అయితే తాజాగా మాజీ ఎమ్మెల్యే తనయుడి కేసు నమోదు కావడం వల్ల ఈ ఇద్దరిని అరెస్టు చేయడం కూడా ఇదే వేట శ్రేణికి సంబంధించి, నేరానికి సహకరించిన కోణంలోనని అధికారులు స్పష్టంచేశారు.
రెండు ఘటనలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని, అర్బన్ పార్క్‌లో వేట జరిగిన రాత్రి అక్కడి నుండి తీసుకువెళ్లిన దుప్పులే తదుపరి రోజున జరిగిన వివాహ విందులో ఉపయోగించబడ్డాయని అటవీశాఖ విచారణలో తేలింది.
వేట ఎలా జరిగింది.?
ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన నేపథ్యంలో దర్యాప్తు గోప్యత, సీసీ కెమెరా ఫుటేజీ విడుదల ఆలస్యం, కీలక వ్యక్తుల వివరాల ప్రకటనలో వచ్చిన అపార్థాలు ప్రజల్లో కలిగించిన అనుమానాలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. అయితే వన్యప్రాణి సంరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన అటవీశాఖ ఇంత పెద్ద సంఘటనలో ప్రారంభ దశలలో స్పష్టత చూపకపోవడంపై పర్యావరణ ప్రేమికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
వేట ఎలా జరిగింది? ఆయుధాలు ఎక్కడి నుండి వచ్చాయి? వేటలో ఇంకెవరెవరు పాల్గొన్నారు? వాహనాల ప్రయాణ వివరాలు ఎలా ఉన్నాయో అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. వాస్తవ నిందితుడు తేలడంతో కేసు మిస్టరీ వీడినప్పటికీ, సహనిందితుల పాత్ర, వేట నిర్వహణ పద్ధతి, వన్యప్రాణుల మాంసం సరఫరాలో ఉన్న మరింత కీలక విచారణ జరగాల్సి ఉంది.
3–7 ఏళ్ల జైలు, వాహనాల స్వాధీనం
దర్యాప్తులో మాజీ ఎమ్మెల్యే తనయుడి
ప్రధాన వేటగాడిగా నిర్ధారణ కావడంతో, (Wild Life Protection Act) సెక్షన్లు అమలయ్యాయి. కనీసం 3–7 ఏళ్ల జైలు, వాహనాల స్వాధీనం, భారీ జరిమానాలు తప్పవని అధికారులు తెలిపారు. అర్బన్ పార్క్ నుంచి వివాహ విందు వరకు దుప్పుల వేటకు సంబంధించిన మొత్తం కథనం స్పష్టమవుతుండడంతో, ఈ కేసు ఖమ్మం జిల్లాలో అతిపెద్ద వన్యప్రాణుల వేట కుంభకోణంగా మారింది.
అధికారులు పూర్తి నివేదిక విడుదల చేయాలని, ఈ కేసుకు సంబంధించి ఎవరైనా మినహాయింపు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
MOST READ :









