Runamafi : రుణమాఫీ రైతులకు వడ్డీ భారం.. బ్యాంకర్ల మెలిక..!
Runamafi : రుణమాఫీ రైతులకు వడ్డీ భారం.. బ్యాంకర్ల మెలిక..!
మన సాక్షి, నల్గొండ బ్యూరో:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీని అమలు చేస్తుంది. కానీ రైతులకు వడ్డీ భారం మాత్రం తప్పడం లేదు. ఇప్పటికే రెండు విడతలుగా రుణమాఫీ నిధులు కూడా విడుదల చేసింది. మొదటి విడతగా (జూలై 12) లక్ష రూపాయల లోపు రుణాలు పొందిన రైతులకు రుణమాఫీ చేసింది.
అదేవిధంగా జులై నెలాఖరున (జూలై 30) లక్షన్నర వరకు రుణాలు పొందిన రైతులకు రుణమాఫీ చేసింది. ఆ మేరకు రైతుల ఖాతాలలో డబ్బులను కూడా జమ చేసింది. రైతులకు బ్యాంకు నుంచి సెల్ ఫోన్ కు మెసేజ్ లతో పాటు ముఖ్యమంత్రి సందేశం కూడా అందింది. రైతులంతా ఆనందంలో ఉన్నారు.
బ్యాంకర్ల మెలిక :
కాగా బ్యాంకుకు వెళితే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. రుణమాఫీ పొందిన రైతులు బ్యాంకుకు వెళ్లి తమ ఎకౌంట్లోని డబ్బులు తీసుకోవాలని కోరుతుండగా ఎక్కువ మంది రైతులు వస్తుండడంతో కేవలం వారితో సంతకాలు తీసుకొని మళ్లీ పిలుస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. అంతేకాకుండా రుణమాఫీ వచ్చిన డబ్బులు కేవలం డిసెంబర్ 9, 2023 వరకే వచ్చాయని మిగతా ఎనిమిది నెలల వడ్డీ డబ్బులు చెల్లించాలని మెలిక పెడుతున్నారు. దాంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో 8 మాసాల వడ్డీ భారం రైతులపై పడుతుంది.
జూలై మాసంలోనే అకౌంట్లోకి డబ్బులు :
రుణమాఫీ పొందిన రైతులకు జూలై మాసంలోనే ప్రభుత్వం రెండు విడతలుగా రుణమాఫీ చేసింది. రుణమాఫీ చేసిన రోజే రైతుల ఖాతాలోకి డబ్బులు వచ్చాయి. కానీ వాటిని బ్యాంకర్లు మాత్రం ఆ డబ్బులు 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు మాత్రమే వడ్డీతో సహా వచ్చాయని, ఆ తర్వాత కాలం వడ్డీని రైతులు చెల్లించాలని మెలిక పెడుతున్నారు.
తిరిగి రెన్యువల్ చేసుకుని రైతులకు వడ్డీ డబ్బులను కట్ చేసుకుంటుండగా ఎకౌంట్లు క్లోజ్ చేసే రైతులు మాత్రం చేతి నుంచి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం రుణమాఫీ చేసింది గత నెలలోనే అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ డిసెంబర్ లో మాఫీ చేసిందంటూ అదనంగా వడ్డీ డబ్బులు బ్యాంకులు చెల్లించాలని పేర్కొనడంపై రైతుల్లో వ్యతిరేక భావన వస్తుంది.
రుణమాఫీ అయినా కూడా రైతులపై వడ్డీ భారం పడుతుంది. ప్రస్తుతం పంటల సీజన్ లో వ్యవసాయ పెట్టుబడులకు పెట్టే పరిస్థితుల్లో అదనంగా వడ్డీ డబ్బులు చెల్లించాలంటే రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి :
భారీ గుడ్ న్యూస్ : ఫోన్ పే, గూగుల్ పే మీకు ఉందా..! ఉంటే తెలుసుకోవాల్సిందే
Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!










