Nalgonda : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చెస్ బోర్డులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్..!
చెస్ (చదరంగం) కేవలం ఒక ఆట మాత్రమే కాదని, అది విద్యార్థుల్లో ఏకాగ్రతను, మానసిక చురుకుదనాన్ని పెంచే అద్భుతమైన సాధనమని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.

Nalgonda : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చెస్ బోర్డులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్..!
గుర్రంపోడు, మన సాక్షి :
చెస్ (చదరంగం) కేవలం ఒక ఆట మాత్రమే కాదని, అది విద్యార్థుల్లో ఏకాగ్రతను, మానసిక చురుకుదనాన్ని పెంచే అద్భుతమైన సాధనమని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. గుర్రంపోడు మండలం కొప్పోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘చెస్ నెట్వర్క్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి కలెక్టర్ ప్రసంగిస్తూ.. భారతదేశంలో పుట్టిన చెస్ ఆట నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. పూర్వం రాజులు రాజనీతిని, విజ్ఞతను, వ్యూహరచనను పెంపొందించుకోవడానికి ఈ ఆటను ఆడేవారని గుర్తుచేశారు.
ఆటలో వేసే ఎత్తులు, పైఎత్తుల వల్ల మెదడు పదును దేలుతుందని, ఇది చదువులో క్లిష్టమైన అంశాలను అర్థం చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుందని వివరించారు. నేటి తరం విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా, చెస్ వంటి మేధోపరమైన క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు.
విశ్వనాథన్ ఆనంద్, అర్జున్ వంటి గ్రాండ్ మాస్టర్లు చెస్ ద్వారానే దేశానికి విశ్వవిఖ్యాతి తెచ్చారని కొనియాడారు. పదో తరగతిలో 10/10 లక్ష్యంగా చదవాలని,కొప్పోలు పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, ప్రతి ఒక్కరూ 10/10 జీపీఏ సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ప్రస్తుతం ఉద్యోగాల పరిధి మారిందని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి బిక్షపతి, మండల విద్యాధికారి నోముల యాదగిరి, చెస్ నెట్వర్క్ ఫౌండర్ సుదీర్, తెలంగాణ ఉద్యమకారుడు వేనేపల్లి పాండురంగారావు పాల్గొన్నారు.
విద్యార్థులకు చెస్ బోర్డులను విరాళంగా అందజేసిన దాతలు వేనేపల్లి రఘురాం, అభిరామ్ లను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ మారుపాక శంకర్, ఉపసర్పంచ్ గోని వెంకటేశం, ఉపాధ్యాయులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి :
- SSC : పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి..!
- BREAKING : తెలంగాణలో ఘోర ప్రమాదం.. ప్రైవేట్ బస్సు బోల్తా, స్పాట్ లో నలుగురు మృతి..!
- TG : తెలంగాణలో ఒంటి పూట బడులకు డేట్ ఫిక్స్.. ఉదయం 8 గంటలకే క్లాసులు ప్రారంభం..!
- డిజిటల్ మనీ మార్పిడి లో ఇలా చేస్తే ఖాతా ఖాళీ, జాగ్రత్తలు తీసుకోకుంటే సైబర్ మోసాల్లో చిక్కుకున్నట్టే..!










