Nalgonda : కలిసి పనిచేస్తే పేదల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుంది.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా గురువారం నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, మున్సిపల్ కాన్సిలర్లకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు.

Nalgonda : కలిసి పనిచేస్తే పేదల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుంది.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!
నల్లగొండ, మన సాక్షి:
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా గురువారం నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, మున్సిపల్ కాన్సిలర్లకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులపై అనేక బాధ్యతలు ఉన్నాయని, ప్రజలతో మమేకమై పనులు చేసినప్పుడే ప్రజల మన్ననలను పొందుతారని అన్నారు.
మున్సిపల్ పట్టణాలలో ప్రజలు అనేక సమస్యలతో ఉంటారని, వారి సమస్యలను తెలుసుకొని వాటిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, తన వంతు సహకారం మున్సిపాలిటీల అభివృద్ధికి ఎల్లప్పుడు ఉంటుందని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా విద్యతోనే మార్పు వస్తుందని ప్రతి ఒక్కరు చదువుకునేలా చూడాలని, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పారిశుధ్యం పై దృష్టి సారించాలని, అలాగే బడ్జెట్ సమావేశాలు నిర్వహించి మున్సిపాలిటీలను సవ్యంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ,వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య లేకుండా ప్రణాళిక రూపొందించాలని, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహించే కార్యక్రమాలపై దృష్టి సారించాలని అన్నారు.
రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కలిసి పనిచేసి అభివృద్ధి, సంక్షేమాన్ని సాధించాలని కలిసికట్టుగా పనిచేస్తే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. వన్నుల వసూలు పై కూడా దృష్టి పెట్టాలన్నారు. అభివృద్ధితో పాటు, రోడ్డు భద్రత ,యువత మత్తుపదార్థాల బారిన పడకుండా ఉండడం, తదితర సామాజిక అంశాలపై కూడా దృష్టి సాధించాలని తెలిపారు. 10400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి విస్తరణ పనులకు టెండర్లు పిలవడం జరిగిందని ,320 కోట్ల రూపాయలతో నల్గొండ నుండి ధర్వేశిపురం వరకు రహదారి విస్తరణకు టెండర్లు పిలిచామని, మాల్- హైదరాబాద్ లైన్ విస్తరణ పనులు కూడా చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక అమలులో భాగంగా క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని, ప్రజలకు మంచి సేవలు అందించేందుకు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు,కౌన్సిలర్లు దృష్టి సారించాలన్నారు . జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు ప్రజల సమస్యలు తెలుస్తాయని, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మమేకమై ప్రజలకు సౌకర్యాలు, సేవలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
మున్సిపల్ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, తాను కూడా జిల్లాలో పర్యటించినప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ,అదేవిధంగా ప్రజావాణిశంలో సమస్యల కోసం ప్రజలు సమర్పించే సమస్యలపై కూడా దృష్టి సారిస్తాన్నారు. ఉగాదికి సామూహిక ఇందిరమ్మ గృహ ప్రవేశాల కార్యక్రమానికి చర్యలు తీసుకోవాలని, వెంటనే మున్సిపల్ బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి బడ్జెట్ అంచనాలపై చర్చించాలని, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను షెడ్యూల్ ప్రకారం ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం సంతోషమని, నూతన ప్రజాప్రతినిధులు ప్రజల్లో ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన తీసుకుని వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజల కోసం పనిచేయాలని, ప్రజాక్షేత్రంలో ఉండాలని పిలుపునిచ్చారు.
నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలను తెలుసుకొని అవగాహన పొందినప్పుడే క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి చేయగలుగుతారని, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు వారి శాఖల ద్వారా అమలు చేసే పలు ప్రభుత్వ పథకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా, వీడియోల ద్వారా మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు అవగాహన కల్పించారు.
పలువురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన తమకు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికతో పాటు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం సంతోషంగా ఉందని, ఇది తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ జే, శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపుకలెక్టర్, నల్గొండ ఆర్ డి వై. అశోక్ రెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్,చండూరు ఆర్డీవో శ్రీదేవి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.









