Nalgonda : ఫిన్లాండ్ దేశ పర్యటనకు ఎంపికైన ఉపాధ్యాయుడు వెంకట్ రెడ్డి..!
ప్రపంచంలోనే అత్యుత్తమైన ఫిన్లాండ్ దేశ విద్యా అధ్యయనానికి నల్గొండ జిల్లా పెద్దవూర మండలం ప్రాథమిక పాఠశాల ఏనెమీదిగూడెం ఉపాధ్యాయుడు తూడి వెంకట్ రెడ్డి ని తెలంగాణ విద్యా శాఖ ఎంపిక చేసింది.

Nalgonda : ఫిన్లాండ్ దేశ పర్యటనకు ఎంపికైన ఉపాధ్యాయుడు వెంకట్ రెడ్డి..!
మిర్యాలగూడ, మన సాక్షి:
ప్రపంచంలోనే అత్యుత్తమైన ఫిన్లాండ్ దేశ విద్యా అధ్యయనానికి నల్గొండ జిల్లా పెద్దవూర మండలం ప్రాథమిక పాఠశాల ఏనెమీదిగూడెం ఉపాధ్యాయుడు తూడి వెంకట్ రెడ్డి ని తెలంగాణ విద్యా శాఖ ఎంపిక చేసింది. మన రాష్ట్ర విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్స్ ఎక్సపోసర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్ పేరుతో రాష్ట్ర స్థాయిలో 28 మంది ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల నుండి ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక చేసి ఫిన్లాండ్ దేశ విద్యా అధ్యయనానికి పంపిస్తున్నారు.
ఈ ఉపాధ్యాయ బృందం ఈ నెల 20వ తేదీ నుండి 5రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. పాఠశాల మౌళిక వసతుల కల్పన, గుణాత్మక విద్యను అందించడం ద్వారా విద్యార్థులు సాధించిన ప్రగతి, మండల స్థాయినుండి రాష్ట్ర స్థాయి వరకు రిసోర్స్ పర్సన్ గా పనిచేసిన అనుభవం, పాఠ్య పుస్తక, కరదీపిక రూపకల్పనలో పాల్గొన్న అనుభవం, సబ్జెక్టు పై వర్క్ షాపుల్లో పాల్గొన్న అనుభవం, వినూత్న బోధన నైపుణ్యాలు, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిల్లో పొందిన అవార్డులు వంటి అంశాల ఆధారంగా ఈ ఎంపిక చేయడం జరిగింది.
గత నెల ఫిబ్రవరిలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్స్ లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున జాతీయ స్థాయి యోగా పోటీలకు ఈ ఉపాధ్యాయుడు ఎన్నిక కావడం ఇతని ప్రతిభకు నిదర్శనం.
దీనితోపాటు ఉపాధ్యాయుడు వెంకట్ రెడ్డి వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, లైఫ్ స్కిల్ కోచ్ గా, కెరీర్ గైడ్ గా విద్యార్థులకు తన సేవలను అందిస్తూ దేశ భక్తి, రక్తదానం, హరితహారం మరియు భారత దేశ సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనం పై అవగాహన కల్పిస్తూ సామజిక సేవలో కూడా ముందున్నాడు.
ఇతను ఫిన్లాండ్ దేశ విద్యా పర్యటనకు ఎంపిక కావడంపట్ల జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి, పెద్దవూర మండల విద్యాధికారి తరి రాము, ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు ఉపాధ్యాయులు తమ హర్షం వ్యక్తం చేశారు









