Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

Bandi Sanjay : ఢిల్లీలోనే కాదు.. ఈసారి గల్లీ గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేయబోతున్నాం..!

Bandi Sanjay : ఢిల్లీలోనే కాదు.. ఈసారి గల్లీ గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేయబోతున్నాం..!

కరీంనగర్, మనసాక్షి :

స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజల కోసం, కాషాయ జెండాను నమ్ముకున్న తన కార్యకర్తలను గెలిపించడం కోసం ఢిల్లీ ఎన్నికల్లోనే కాదు గల్లీ ఎన్నికల్లోనూ కొట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. స్థానిక సమరంలో ఈసారి బీజేపీ కొత్త చరిత్రను లిఖించబోతోందన్నారు.

కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ పీఠాలపై కాషాయ జెండా ఎగరేసి తీరుతామని స్పష్టం చేశారు. ఆసియా కప్, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లలో ఇండియా ఘన విజయం సాధించినట్లుగానే రేపు జరగబోయే కరీంనగర్ పల్లె లీగ్ (కేపీఎల్ లీగ్), సిరిసిల్ల పల్లె లీగ్ (ఎస్పీఎల్) స్థానిక పోటీల్లోనూ బీజేపీ అభ్యర్థుల గెలుపు తథ్యమన్నారు. పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి పనిచేస్తున్న నిఖార్సైన బీజేపీ కార్యకర్తలకే ఈసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు.

టిక్కెట్లు ఇవ్వడంతోపాటు గెలిపించుకుని కాషాయ కార్యకర్తల నుదుటిన విజయ తిలకం దిద్దుతామని తెలిపారు. నేడు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తున్నామని నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనా వైఫల్యాలవల్ల స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమైనయన్నారు.

గత బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలకు నిధులివ్వకపోవడమే కాక అభివ్రుద్ది పేరుతో నాటి సర్పంచులు చేసిన పనులకు కూడా బిల్లులివ్వకుండా వేధించిందన్నారు. కేంద్రం నుండి వచ్చిన నిధులను సైతం దారి మళ్లించిందని, కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే రాష్ట్ర ప్రభుత్వం వద్ద పైసల్లేవంటూ స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా ఈ పార్టీ చేతులెత్తేసిందన్నారు.

దేశ చరిత్రలో 22 నెలలుగా పంచాయతీలకు నయాపైసా విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమేనన్నారు. పంచాయతీ సిబ్బందికి జీతాలివ్వడం లేదని, ట్రాక్టర్లకు డీజిల్ పైసలు కూడా ఇవ్వడం లేదన్నారు. పంచాయతీల్లో అంతో ఇంతో అభివ్రుద్ది చెందుతోందంటే ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు.

ఏటా క్రమం తప్పకుండా పంచాయతీలకు ఠంచన్ గా నిధులను ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని, జాతీయ ఉపాధి హామీ పథకం మొదలు సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (సీఆర్ఐఎఫ్), ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన దాకా ఈరోజు గ్రామాల్లో జరిగే అభివ్రుద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో చేస్తున్నావే అని గుర్తు చేశారు. స్థానిక సంస్థల పాలక మండళ్ల గడువు ముగిసి రెండేళ్లు కావొస్తున్నా కాంగ్రెస్ పాలకులు ఎన్నికలను నిర్వహించకపోవడంవల్ల రాజ్యాంగం ప్రకారం కేంద్రం నుండి వచ్చే నిధులు కూడా ఆగిపోయాన్నారు.

దీనికి ప్రస్తుత కాంగ్రెస్ పాలకులే కారణమని, కేంద్రం నుండి నిధులు ఆగిపోవడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించి ఆ నిధులు తెచ్చుకోవాలనుకుంటున్నారే తప్ప స్థానిక ఎన్నికలు నిర్వహించి గ్రామాలను, మండలాలను అభివ్రుద్ది చేసుకుందామనే ఆసక్తి కాంగ్రెస్ పాలకులకు లేనే లేదన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ చేసిన మోసాలను ఇంటింటికీ తీసుకెళ్లి ఎండగడతమని హెచ్చరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని పల్లెపల్లెకూ వివరిస్తామన్నారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసిన పాపాలను సైతం వివరించి ప్రజల ముందు దోషులుగా నిలబెడతామన్నారు. పొరపాటున కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాయ మాటలు నమ్మి గెలిపిస్తే ఈసారి ఊరు వల్లకాడు అవుతుందనే వాస్తవాన్ని ప్రజల ముందుంచుతామన్నారు. అదే సమయంలో గ్రామ పంచాయతీలకు మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోపాటు ఆ నిధులవల్ల జరిగిన అభివ్రుద్ధిని సైతం ఇంటింటికీ వివరిస్తామన్నారు.

ఢిల్లీలోనే కాదు ఈసారి జరగబోయే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గల్లీ గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేస్తామన్నారు. అత్యధిక మండల పరిషత్ పీఠాలతోపాటు కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ పీఠాలను సైతం కైవసం చేసి ఈ కొత్త చరిత్రను లిఖించబోతున్నమన్నారు.

బీజేపీ పక్షాన నిలబడే అభ్యర్థులను ఆశీర్వదించి అక్కున చేర్చుకోవాలని కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు విజ్ఝప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు ఎన్నికల్లో గెలిచే అవకాశమున్న నాయకులకు మాత్రమే టిక్కెట్లు ఇస్తామన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే సర్వే టీంలు ఒక దఫా సర్వే పూర్తి చేశాయన్నారు. రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో నిన్నటి నుండి సర్వే టీంలు రంగంలోకి దిగినట్లు తెలిపారు.

అభ్యర్థుల ఎంపిక విషయంలో పైరవీలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామన్నారు. గెలుపే గీటురాయిగా భావించి టిక్కెట్లు ఇస్తామని, పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న నాయకులు కొన్ని చోట్ల గెలిచే అవకాశం లేకపోయినా, రిజర్వేషన్ల మూలంగా టిక్కెట్లు రాకపోయినా నిరాశ చెందవద్దన్నారు.

వారికి పార్టీలో, ఇతరత్రా పదవుల్లో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని తెలిపారు. అంతిమంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి అత్యధిక స్థానాలు సాధించి కాషాయ జెండా సత్తాను చాటాలని బండి సంజయ్ కోరారు.

MOST READ : 

  1. Fastrack : అదిరిపోయే లుక్‌తో ఫాస్ట్రాక్ కొత్త వాచెస్.. ఇకపై యూఎఫ్‌వోలు ఆకాశంలో కాదు, మీ చేతిలోనే..!

  2. Groups : తల్లి అంగన్వాడి ఆయా.. కుమారుడికి ఒకేసారి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్, నయాబ్ తహసిల్దార్, ఉద్యోగాలు..!

  3. KLI : తెగిపోయిన కేఎల్ఐ కాలువ.. వృధాగా పోతున్న నీరు..!

  4. Nelakondapalli : రూ.5 కోట్ల తో బౌద్ధక్షేత్రం చరిత్ర ప్రపంచం కు తెలిసేలా అభివృద్ధి..! 

  5. TG News : తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ..!

మరిన్ని వార్తలు