పింఛన్ ఆగింది.. బతుకు భారమైంది..!
పుట్టుకతోనే నడవలేని, కూర్చోలేని స్థితిలో ఉన్న ఓ దివ్యాంగుడికి గత రెండు నెలలుగా పింఛన్ నిలిచిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

పింఛన్ ఆగింది.. బతుకు భారమైంది..!
ఈకేవైసీ వెరిఫికేషన్ సమస్యతో ఇబ్బందులు..
అధికారుల చొరవ కోసం కుటుంబం ఎదురుచూపులు..
(కంగ్టి – జలీల్ )
పుట్టుకతోనే నడవలేని, కూర్చోలేని స్థితిలో ఉన్న ఓ దివ్యాంగుడికి గత రెండు నెలలుగా పింఛన్ నిలిచిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేవైసీ వెరిఫికేషన్ సమయంలో చేతివేళ్ల వేలిముద్రలు, కంటి పాప స్కానింగ్ సరిగా నమోదు కాకపోవడంతో పింఛన్ నిలిచిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన మల్లే వీరేశం (25) తండ్రి శరణప్ప పుట్టుకతోనే నడుము సమస్య కారణంగా పూర్తిగా నడవలేని, కూర్చోలేని స్థితిలో ఉన్నాడు. సదరం క్యాంపు సర్టిఫికెట్ 90 శాతం ఆధారంగా గత 2005 సంవత్సరం నుంచి 2026 వరకు వికలాంగుల పింఛన్ పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, రెండు నెలల క్రితం పింఛన్‌కు సంబంధించి ఈకేవైసీ వెరిఫికేషన్ నిర్వహించిన సమయంలో చేతివేళ్ల వేలిముద్రలు, కంటి పాప స్కానింగ్ నమోదు కాకపోవడంతో పింఛన్ నిలిచిపోయిందని పేర్కొన్నారు.
పింఛన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు రెండు నెలలుగా డబ్బులు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ తిరిగి పొందేందుకు ఏం చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిశీలించి, ప్రత్యామ్నాయ ధ్రువీకరణ విధానం ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసి పింఛన్ పునరుద్ధరించాలని బాధిత కుటుంబం కోరుతోంది.









