కేబినెట్లో కూర్చుంటే రైతుల కష్టాలు అర్థం కావు.. బి.వి. రాఘవులు
ఎలినోవా ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు డిమాండ్ చేశారు.

కేబినెట్లో కూర్చుంటే రైతుల కష్టాలు అర్థం కావు.. బి.వి. రాఘవులు
ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటించాలి
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు
బి.వి. రాఘవులు
నల్గొండ జిల్లా చర్లపల్లి లో సిపిఐఎం బృందం కరువు పరిస్థితులను పరిశీలన.
నల్లగొండ, మన సాక్షి :
ఎలినోవా ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరారు. గురువారం నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం చెర్లపల్లి గ్రామంలో ఎలినోవా ప్రభావంతో ఎండిపోయిన పంట పొలాలను సీపీఐ(ఎం) రాష్ట్ర, జిల్లా నాయకత్వం, రైతు సంఘం నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం బి.వి. రాఘవులు మాట్లాడుతూ.. **“చెర్లపల్లి గ్రామంలో ప్రధానంగా వరి, పత్తి పంటలు సాగు చేశారు. వరి పంట పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొన్ని చోట్ల పంట పూర్తిగా ఎండిపోయింది. తాలు తప్ప గింజ కనిపించని పరిస్థితి నెలకొంది. మరో తడుపు నీరు అందితే పంట చేతికొచ్చేది. మొత్తం పెట్టుబడి పెట్టి పంట దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు చివరికి ఒక్క పైసా కూడా చేతికి రాని పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దుర్భరమైన పరిస్థితి. చిన్న, సన్నకారు రైతులు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోతే వారి జీవితాలు ఎంత హృదయవిదారకంగా ఉంటాయో ఇక్కడి రైతుల పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది” అని అన్నారు.
పత్తి పంట పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది
“పత్తి చేలు పైకి పచ్చగా కనిపిస్తున్నప్పటికీ ఆకులన్నీ వాడిపోయాయి. మరో వారం రోజులు వర్షం లేకపోతే పత్తి పంట కూడా పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వర్షాభావం వల్ల పంట పెరుగుదల లేదు. కాపు కాసిన కాయలు కూడా ఎండిపోయి రాలిపోతున్నాయి. భవిష్యత్తులో మళ్లీ వర్షాలు పడతాయనే గ్యారెంటీ కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో తక్షణమే ప్రకటించాలి” అని రాఘవులు డిమాండ్ చేశారు.
కేబినెట్లో కూర్చుంటే రైతుల కష్టాలు అర్థం కావు
“రాష్ట్రంలో ఎలినోవా ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై చర్చించేందుకు రేపు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు పత్రికల్లో వచ్చింది. అయితే కేబినెట్లో కూర్చొని చర్చిస్తే రైతుల వాస్తవ పరిస్థితులు పూర్తిగా అర్థం కావు. మంత్రులందరూ జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 315 మండలాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం మాత్రమే సరిపోదు. మంత్రులు నేరుగా పొలాల్లోకి వెళ్లి పంటలను పరిశీలిస్తేనే రైతులు ఎదుర్కొంటున్న హృదయవిదారక పరిస్థితులు అర్థమవుతాయి. రైతులను ఎలా ఆదుకోవాలనే దానిపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలి” అని అన్నారు.
తాగునీటి సమస్యతో పాటు రైతుల కష్టాలపైనా దృష్టి పెట్టాలి
“రాబోయే రోజుల్లో తాగునీటి కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. తాగునీటి సమస్యపై ప్రభుత్వం ఆలోచించడం అవసరమే. భవిష్యత్తులో నీటి కొరత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతం రైతులు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితి ఏర్పడింది. చివరికి కుటుంబ పోషణకు, తిండికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తోంది. కాబట్టి రైతులను తక్షణమే ఆదుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి” అని రాఘవులు స్పష్టం చేశారు.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి
“కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకు నిధులు కోరినట్లు చెబుతున్నారు. అయితే ఈ మొత్తం ఎంతవరకు సరిపోతుందో కూడా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందో లేదో స్పష్టత లేదు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తేనే రాష్ట్రానికి నిధులు సాధించే అవకాశం ఉంటుంది.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలి. రేపటి కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి అన్ని పార్టీలను కలుపుకొని అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వనరుల నుంచి తక్షణ సహాయంగా రైతులకు ఎంత మొత్తాన్ని ఖర్చు చేయబోతున్నారో కూడా ప్రకటించాలి” అని డిమాండ్ చేశారు.
ఇది సాధారణ పరిస్థితి కాదు.. అత్యవసరంగా స్పందించాలి
“ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి సాధారణమైనది కాదు. ఇది అత్యవసర పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై తీవ్రంగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. అఖిలపక్ష సమావేశం నిర్వహించడంతో పాటు రైతు సంఘాలతో కూడా చర్చించాలి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి” అని బి.వి. రాఘవులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ పర్యటనలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, తీగల సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరపల్లి వెంకటేశ్వర్లు, పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, సయ్యద్ హాశం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం, దండంపెల్లి సత్తయ్య, కొండ అనురాధ, తదితరులు పాల్గొన్నారు…










