విద్యార్థిని కిడ్నాప్ డ్రామా.. ! – latest news

బాయ్ ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు వెళ్లి కిడ్నాప్ డ్రామా

విద్యార్థిని కిడ్నాప్ డ్రామా.. !

బాయ్ ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు వెళ్లి కిడ్నాప్ డ్రామా

జడ్చర్ల , మనసాక్షి : బాయ్ ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు వెళ్లి తల్లిదండ్రులకు తెలియకూడదని ఓ యువతి కిడ్నాప్ డ్రామా ఆడింది. ఈ విషయం పోలీసుల విచారణలో బయటపడింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం… వనపర్తికి చెందిన ఓ యువతి (20) డిగ్రీ అక్కడే చదువుతుంది. ఇబ్రహీంపట్నంలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ జన్మదిన వేడుకలకు వెళ్లాలని నిర్ణయించుకొని బుధవారం కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి జన్మదిన వేడుకలకు వెళ్ళింది. దూర ప్రాంతం కావడంతో సాయంత్రం ఇంటికి ఆలస్యంగా చేరుకునే అవకాశం ఉంది. దాంతో ప్రతిరోజు మధ్యాహ్నమే ఇంటికి వచ్చే తన కూతురు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేశారు. కొద్దిసేపట్లో ఇంటికి వస్తున్నానని చెప్పి ఫోన్ స్విచాఫ్ చేసింది. దాంతో సమయానికి ఇంటికి వెళ్లే పరిస్థితి లేకపోవడం వల్ల ఆ యువతి కిడ్నాప్ డ్రామాకు తెరలేపింది.

మార్గమధ్యలో జడ్చర్ల కొత్త బస్టాండ్ లో దిగి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తాను వనపర్తి లో ఉంటానని, తనతో పాటు మరో నలుగురు అమ్మాయిలను గుర్తుతెలియని వ్యక్తులు మత్తుమందు ఇచ్చి కారులో కిడ్నాప్ చేశారని వివరించింది. తాను మత్తు నుంచి తేరుకొని తప్పించుకున్నట్లు చెప్పింది. పోలీసులు ప్రశ్నలు అడగడంతో అసలు విషయం బయటపడింది.

ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. ఇలాంటి సంఘటనల వల్ల నిజంగా కిడ్నాప్ జరిగినా… నమ్మలేని పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.