Suryapet : సూర్యాపేట మున్సిపాలిటీకి ‘ఉత్తమ పర్యావరణ’ పురస్కారం..!
వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేస్తున్న సూర్యాపేట మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది.

Suryapet : సూర్యాపేట మున్సిపాలిటీకి ‘ఉత్తమ పర్యావరణ’ పురస్కారం..!
సూర్యాపేట, మనసాక్షి
వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేస్తున్న సూర్యాపేట మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ప్రదానం చేసే ఉత్తమ పర్యావరణ పనితీరు పురస్కారం’కు సూర్యాపేట మున్సిపాలిటీ ఎంపికైంది.
ఈ పురస్కారాన్ని శుక్రవారం హైదరాబాద్లోని టీజీపీసీబీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దేవాదాయ, అటవీ శాఖ, ఎన్విరాన్ మెంట్ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి, మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి లు అందుకున్నారు.
పట్టణంలో వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగం, పారిశుధ్య కార్యక్రమాల అమలు, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో సూర్యాపేట మున్సిపాలిటీ కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని రీసైక్లింగ్ చేయడం, పర్యావరణ రహిత కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా అమలు చేయడం మున్సిపాలిటీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీకి లభించిన ఈ పురస్కారం పట్టణ ప్రజలు, పారిశుధ్య కార్మికులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషికి నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో కూడా పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి సూర్యాపేటను రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణలో సూర్యాపేట అమలు చేస్తున్న వినూత్న విధానాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు చర్యలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ అవార్డుతో సూర్యాపేట మున్సిపాలిటీ రాష్ట్రంలో పర్యావరణహిత పట్టణాల జాబితాలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.









