Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

TG News : దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చి దిద్దుతాం..!

TG News : దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చి దిద్దుతాం..!

సూర్యాపేట, మనసాక్షి :

పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలకు ఉద్యోగులు రాష్ట్ర అవతరణ దినోత్సవం నుండి పునరంకితం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

శుక్రవారం సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ పథకాలైన ధాన్యం సేకరణ, వ్యవసాయం, రుతుపవనాలు, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి పథకాలపై ఉమ్మడి నల్గొండ జిల్లా కు సంబంధించి నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పంటలు, ధాన్యం సేకరణ, నీటిపారుదల విషయంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న జిల్లాగా పేరుగాంచిందని, నల్గొండ జిల్లా భారతదేశానికి భాండాగారంగా నిలవాలని ఆకాంక్షించారు.

నల్గొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధి రాష్ట్రానికి మార్గదర్శకం కావాలని అన్నారు. అధికారులు ఇప్పటివరకు ఉన్న నిర్లిప్తతను వదిలేసి పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలని, ముఖ్యంగా రానున్న రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి ప్రజల సేవకు అందరూ కలిసి రావాలని అన్నారు. జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోటలు పెంచేందుకు అవకాశం ఉందని, అందువల్ల రైతులు పామాయిల్ తోటలు పెంచాలని, ప్రత్యేకించి నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఎక్కువ అవకాశం ఉన్నందున సూర్యాపేట, నల్గొండ మధ్య ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

వరి పంట వేసి ఇబ్బందులు పడొద్దని, అలాగే ఎరువులు, యూరియా వాడకాన్ని తగ్గించాలని, డిమాండ్ ఉన్న పంటలు వేయాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం అత్యధికంగా ధాన్యం సేకరణ చేయడం పట్ల జిల్లా కలెక్టర్లను ప్రత్యేకించి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ని అభినందించారు.

వచ్చే సీజన్ నుంచి అన్ని కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని శుభ్రపరిచే యంత్రాలు, ధాన్యం ఆరబెట్టే యంత్రాలను ఇస్తామని, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం లో వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సాధించలేని విధంగా ధాన్యం సేకరణ తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరిగిందని, మే 29,2023 నాటికి రాష్ట్రంలో యాసంగిలో కేవలం 47 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొంటె, ఈ సంవత్సరం మే 29 నాటికి 67 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని , గత సంవత్సరంతో పోలిస్తే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువగా కొన్నామని తెలిపారు.

2023లో యాసంగి లో ధాన్యం అమ్మిన రైతులకు 3,600 కోట్ల రూపాయలు చెల్లిస్తే, తమ ప్రభుత్వం ఈ సంవత్సరం 13250 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించడం జరిగిందని తెలిపారు. సన్నబియ్యం పై సుమారు 10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, గతంలో రెండు కోట్ల 87 లక్షల మందికి పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి దొడ్డు బియ్యం అందించగా, 70% అక్రమంగా తరలించబడిందని, తమ ప్రభుత్వం సన్న బియ్యం పండించిన రైతులకు 500 బోనస్ ఇచ్చామని, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నామని, అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో బియ్యంతో పాటు, ఇతర రేషన్ సరుకులు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.

అధికారులు అవినీతికి ఆస్కారం లేకుండా పని చేయాలని, రాష్ట్రం దేశంలోనే ముందుండేలా పని చేయాలని, జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి 24 గంటలు అందుబాటులో ఉండి పారదర్శకంగా పనిచేయాలని, అలసత్వాన్ని వీడాలని, అవినీతిని సహించేది లేదని, ప్రత్యేకించి రెవెన్యూ, పోలీసు శాఖల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు, లంచగొండితనం ఉండరాదని, ప్రతి పథకం నిరుపేదలకు అందుబాటులో ఉండాలని, వచ్చే సమీక్ష సమావేశాలలో సాధారణ పరిపాలనకు సంబంధించిన అంశాలపై సమీక్షించడం జరుగుతుందని, గడచిన పదేళ్లలో అధికారుల అలసత్వం, అవినీతికి ఎక్కువగా అవకాశాలు ఉండేవని, తమ ప్రభుత్వంలో వాటన్నిటిని విడనాడాలని హెచ్చరించారు .

రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో 12 లక్షల భూములు సాగు లో ఉన్నాయని, గతంతో పోలిస్తే ఈ సంవత్సరం రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కువగా పండించామని, ఇందుకుగాను జిల్లా కలెక్టర్ ను ఆయన అభినందించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాను అన్నింటిలో ముందు ఉంచేందుకు అధికారులు ఇలాగే ముందుకు వెళ్లాలని, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కలెక్టర్లది ముఖ్య పాత్రని, సన్న బియ్యం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని, రాజీవ్ యువ వికాసం ద్వారా వేలాది మంది యువతకు స్వయం ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, నైపుణ్యాల అభివృద్ధి వల్ల వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు.

నల్గొండ జిల్లాలో ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా ఉన్నందున అదనపు గోదాముల అవసరం ఉందని, అందువల్ల అదనపు గోదాములు మంజూరు చేయడమే కాకుండా, క్లస్టర్లను, ఏఈవో పోస్టులను మంజూరు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. తన శాఖ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా కు అత్యధికంగా 1700 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని ఆయన వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఛామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జై వీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. District collector : భూ భారతి చట్టంలో సాదా బైనమా అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే..

  2. Miryalaguda : మిర్యాలగూడలో 12 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్..!

  3. WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఇక టైపింగ్ లేదు.. మాట్లాడొచ్చు..!

  4. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడు.. వారికి లేదా.. లేటెస్ట్ అప్డేట్..!

  5. UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!

మరిన్ని వార్తలు