TOP STORIESBreaking Newsతెలంగాణమహబూబ్‌నగర్విద్య

Amazon : అమెజాన్ స్కాలర్‌షిప్‌తో తెలంగాణ యువతి విజయం.. మరో 500 మందికి ఆర్థిక చేయూత..!

Amazon : అమెజాన్ స్కాలర్‌షిప్‌తో తెలంగాణ యువతి విజయం.. మరో 500 మందికి ఆర్థిక చేయూత..!

మహబూబ్‌నగర్, దేవరకద్ర, మన సాక్షి:

తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన సామల కీర్తి అమెజాన్ సహకారంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆమెకు అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్‌షిప్ చేయూతనిచ్చింది. ఉపకారవేతనం సాయంతో ఐటీ రంగంలో మంచి కొలువు సాధించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.

ఈ స్కాలర్‌షిప్ ఆమెకు ఆర్థిక సహాయంతో పాటు నైపుణ్య శిక్షణ, మెంటర్‌షిప్, ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించింది. ప్రస్తుతం ఆమె అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా చేరారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ.. “మా నాన్న కిరాణా దుకాణం నడుపుతూ.. నెలకు రూ. 25 వేల వరకు సంపాదిస్తూ ఇల్లు నెట్టుకొస్తున్నారు. అమెజాన్‌లో ఉద్యోగం పొందడం అసాధ్యం అనిపించింది.

అమెజాన్ స్కాలర్‌షిప్ ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు. ఇది నాకు ఆత్మవిశ్వాసం, మార్గదర్శకత్వం, నా కెరీర్‌ను సమూలంగా మార్చింది” అని పేర్కొన్నారు.

అమెజాన్ సంస్థ, అల్పాదాయ వర్గాల యువతులను ప్రోత్సహించే లక్ష్యంతో మరో 500 కొత్త స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన ప్రతి విద్యార్థికి నాలుగు సంవత్సరాల కాలానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం, ల్యాప్‌టాప్, ప్రత్యేక శిక్షణ, మరియు ఇంటర్న్‌షిప్‌లు లభిస్తాయి. గతంలో ఈ స్కాలర్‌షిప్ పొందిన వారిలో 80% మంది ఫార్చ్యూన్ 500 కంపెనీలలో ఉద్యోగాలు పొందారు.

ఈ కార్యక్రమం భారతదేశంలో సాంకేతిక రంగంలో మహిళలను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది. టైర్-2 మరియు టైర్-3 నగరాల నుండి వచ్చిన విద్యార్థులు కూడా దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ స్కాలర్‌షిప్ ద్వారా అవకాశాలు, ప్రతిభ కలిసినప్పుడు అద్భుతాలు సాధించవచ్చని అమెజాన్ ఇండియా, అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ లీడ్ ప్రతీక్ అగర్వాల్ తెలిపారు.

ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ సీఈవో రామ్ కోలవెన్ను మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా కేవలం మంచి ఇంజినీర్లను మాత్రమే కాకుండా, భవిష్యత్తులో సాంకేతిక రంగాన్ని నడిపించే నాయకులను కూడా తయారు చేయవచ్చని తెలిపారు.

దరఖాస్తు చేసే విధానం..

2025-2029 విద్యా సంవత్సరాల కోసం దరఖాస్తులు ఆగస్టు 18 నుండి నవంబర్ 30, 2025 వరకు అందుబాటులో ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత కోర్సుల్లో చేరిన మహిళా ఇంజనీరింగ్ విద్యార్థులు అర్హులు. అర్హత, ఇతర వివరాల కోసం www.amazonfutureengineer.in/scholarship ను సందర్శించవచ్చు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అమెజాన్, లాభాపేక్ష లేని సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ (FFE) తో కలిసి నిర్వహిస్తోంది. ఎంపికైన విద్యార్థుల పేర్లు 2026 ప్రారంభంలో ప్రకటిస్తారు. ఈ స్కాలర్‌షిప్‌లు దేశంలోని ప్రతిభావంతులైన యువతులకు సాంకేతిక రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాయి.

MOST READ : 

  1. Miryalaguda : జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి మీరు అర్హులైతే.. వెంటనే ధరఖాస్తు చేసుకోవాలి..!

  2. Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. తిప్పర్తి ఘటన కేసులో 50 ఏళ్ల జైలు, 80 వేల జరిమానా..!

  3. NMDC : హైదరాబాద్ మారథాన్ 2025కు అధికారిక భాగస్వామిగా తమ మారథాన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించిన ఏసిక్స్..!

  4. Murder : వీడిన సహస్ర హత్య మిస్టరీ.. అసలు ఎందుకు హత్య చేశాడో తెలుసా..!

మరిన్ని వార్తలు