Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తూడి వెంకటరెడ్డి ఎంపిక..!

తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు పెద్దవూర మండలం, ఏనెమీది గూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తూడి వెంకటరెడ్డి ఎంపికయ్యారు.సెప్టెంబర్ 5 గురుపూజ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తూడి వెంకటరెడ్డి ఎంపిక..!

నల్గొండ (పెద్దవూర), మన సాక్షి

తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు పెద్దవూర మండలం, ఏనెమీది గూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తూడి వెంకటరెడ్డి ఎంపికయ్యారు.సెప్టెంబర్ 5 గురుపూజ దినోత్సవం సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు

తాను పనిచేసిన పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడంతో పాటు విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు వెంకటరెడ్డి విశేష కృషి చేశారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తూ, వారిని వివిధ పోటీ పరీక్షల్లో విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పాఠశాల ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటడం, వాటి సంరక్షణకు చర్యలు చేపట్టడం, పాఠశాల అభివృద్ధికి తన సొంత నిధులను సైతం వినియోగించడం ఆయన సేవాభావానికి నిదర్శనం.

ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల పోటీని తట్టుకొని శెట్టిపాలెం పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 65 నుండి 108 కి పెంచడం, బాబుసాయిపేట పాఠశాలలో 8 నుండి 150 వరకు పెంచడం, 80 మంది విద్యార్థులకు రెండు నెలల పాటు ఒక్కడే బోధించడం,200 పైగా చెట్లను పెంచడం, ఆదర్శ, గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షల్లో ప్రతిసంవత్సరం నూరుశాతం సీట్లు సాధించడం ఇతని వృత్తి నిబద్ధతకు నిదర్శనం.

గత 15 సంవత్సరాలుగా జిల్లా గణిత రిసోర్స్ పర్సన్‌గా సేవలందిస్తున్న ఆయన, ఉపాధ్యాయులకు గణిత బోధనలో నూతన పద్ధతులపై శిక్షణ అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022లో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన తొలిమెట్టు కార్యక్రమంలో రాష్ట్ర రిసోర్స్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించి, కార్యక్రమానికి సంబంధించిన మాడ్యూల్స్ రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నారు.

సమాజ సేవలోనూ విశేష కృషి

విద్యారంగంతో పాటు సమాజ సేవలో కూడా వెంకటరెడ్డి తనదైన ముద్ర వేశారు. యోగా, రక్తదానం, హరితహారం, దేశభక్తి, భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాల గొప్పతనం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ కొన్ని వేల మందికి చైతన్యం కల్పించారు.

ఫిన్లాండ్ విద్యా విధానంపై అధ్యయనం

వెంకటరెడ్డి గత ఏప్రిల్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిన్లాండ్ విద్యా విధానంపై అధ్యయనం చేసేందుకు వెళ్లిన ఉపాధ్యాయ బృందంలో సభ్యుడిగా పాల్గొన్నారు. ఫిన్లాండ్‌లోని విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, విద్యార్థి కేంద్రిత అభ్యసనం వంటి అంశాలను అధ్యయనం చేసి, వాటిలో అనువైన ఉత్తమ పద్ధతులను తెలంగాణ పాఠశాలల్లో అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అంతర్జాతీయ గుర్తింపు

2022లో ప్రపంచవ్యాప్తంగా 73 దేశాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్న అంతర్జాతీయ సదస్సులో గ్లోబల్ టీచర్ అవార్డును సైతం వెంకటరెడ్డి అందుకోవడం విశేషం. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ సంస్థల నుంచి పదుల సంఖ్యలో అవార్డులు, పురస్కారాలను ఆయన సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా, గత ఫిబ్రవరిలో జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ రాష్ట్రం తరఫున జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు.

యువతకు అండగా…

వెంకటరెడ్డి పనిచేస్తున్న గ్రామంలో కేవలం పాఠశాల అభివృద్ధికే పరిమితం కాకుండా, గ్రామ యువతను కూడా చైతన్యపరుస్తూ వారి విద్యా, ఉద్యోగ అవకాశాల కల్పనలో తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్నారు. యువతకు సరైన మార్గనిర్దేశం చేస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేయడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.

విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల అభివృద్ధి, ఉపాధ్యాయ శిక్షణ, సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, యోగా, యువతకు మార్గదర్శకత్వం వంటి విభిన్న రంగాల్లో ఆయన చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. వెంకటరెడ్డి అవార్డుకు ఎంపికైన సందర్భంగా జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు, మండల విద్యాధికారి టి. రాము,రాష్ట్ర, జిల్లా ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ మిత్రులు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు