Mahalakshmi Scheme : మహాలక్ష్మి పథకం ద్వారా 182 కోట్ల జీరో టిక్కెట్లు.. ఆడపడుచులకు రూ.6088 కోట్ల ఆదా..!
Mahalakshmi Scheme : మహాలక్ష్మి పథకం ద్వారా 182 కోట్ల జీరో టిక్కెట్లు.. ఆడపడుచులకు రూ.6088 కోట్ల ఆదా..!
సూర్యాపేట, మనసాక్షి
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాల బాటలో కొనసాగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట బస్ డిపో లో ఎలక్ట్రిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లతో కలిసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాలుష్యం నుండి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొన్ని వాతావరణంను కాపాడుకుంటూ ఆర్టీసీ సంస్థ ముందుకు వెళ్తుందని పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి అయినప్పటి నుండి ఆర్టిసి లో సమూల మార్పులు తెచ్చి అనేక సంస్కరణలతో ముందుకు వెళ్ళటం శుభ పరిణామం అని తెలిపారు.
గతంలో సామాన్యుడి అవసరాలు తీర్చేందుకు ఆర్టీసీ సంస్థ ఎంతగానో కృషి చేసింది కానీ లాభాలు లేకుండా ఎప్పుడూ నష్టాల బాటలో కొనసాగిందని కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆర్టీసీ అనే ప్రభుత్వ సంస్థను కాపాడుకునేందుకు, ఆర్థికంగా నిలబెట్టేందుకు తగు చర్యలతో ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు.
పాత బస్సులను, డీజిల్ బస్సులను పక్కకి పెట్టి ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా వాతావరణాన్ని కాపాడుకుంటూ ప్రజలకు సేవ చేసేందుకు సూర్యాపేట డిపోకు 79 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరైనాయని వాటిలో ఈరోజు 45 ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
రాష్ట్ర రాజధాని, ఔటర్ రింగ్ రోడ్ లోపల, హైదరాబాద్ అనే మహానగరంలో వాతావరణ ఆహ్లాదకరంగా ఉండేందుకు 2800 ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటుచేసి సామాన్యులకు రవాణా అవసరాలు తీరుస్తూ వాతావరణాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తుందని అన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని ఆడపడుచులు అందరు ఆర్టీసీ బస్సుల ద్వారా రాష్ట్రము లొ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు ఉచితంగా తీసుకెళ్లడం జరుగుతుందని ఇప్పటివరకు 182 కోట్ల జీరో టికెట్లు జారీ చేశామని వాటి ద్వారా తెలంగాణ ఆడపడుచులు 6088 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని ఆ డబ్బులు ప్రభుత్వం ఆర్టీసీకి నేరుగా జమ చేయడం జరిగిందని దానితో నేడు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుకొని పూర్తి సామర్థ్యంతో రాష్ట్రమంతా బస్సులు నడుస్తున్నాయని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను కాపాడేందుకు మారుతున్న మార్పులను అప్డేట్ చేసుకుంటూ భవిష్యత్ తరాలకు అందించడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
రాష్ట్ర రవాణా, బి సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చుట్టూ సూర్యాపేట నడుమ నల్గొండ అంటూ తెలంగాణ సాయుధ పోరాటం గుర్తు చేసుకుంటూ ప్రజాప్రభుత్వం లో మారుతున్నా కాలానికి అనుగుణంగా, కార్మికుల సంక్షేమం కోరుకుంటూ నేడు సూర్యాపేట డిపో నుండి హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కోదాడ లాంటి ప్రాంతాలకి వాతావరణంను కాపాడుకుంటూ 79 ఎలక్ట్రికల్ బస్ లు మంజూరు చేయటం జరిగిందని అన్నారు. వాటిలో నేడు 45 ఎలక్ట్రికల్ బస్ లు ప్రారంభం చేయటం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లో ఎలక్ట్రికల్ బస్ లు నడుస్తున్నాయని త్వరలో నల్గొండ లో కూడా ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసి బస్ లు మంజూరు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు అమ్మగారి ఇంటికి, పుణ్య క్షేత్రాలకి ఉచితంగా ఆర్టీసీ ద్వారా ప్రయాణిస్తున్నారని అన్నారు. ఇందుకు గాను ప్రతి నెల 300 నుంచి 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇస్తున్నారని తెలిపారు.ఈ ఆర్థిక సహాయం ద్వారా కార్మికుల సంక్షేమం, భవిష్య నిది, నూతన బస్సులు, కారుణ్య నియామకాలు ఇస్తున్నామని తెలిపారు.
గత 10 సంవత్సరాలు ఒక్క నూతన బస్సు గాని,కొత్త ఉద్యోగం గానీ ఇవ్వకుండా ఆర్టీసీని నష్టాల ఊబిలో కురుకొనిపోయేలా చేశారని ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వేలాది కొత్త బస్సులు, ఉద్యోగాలు నియమించటం జరిగిందని అన్నారు.ఆర్టీసీని పరిరక్షించుకుంటూ గ్రామాలకు రవాణా వ్యవస్థ చేరుకునేలా భవిష్యత్తులో కొత్త బస్సులు కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తండ్రి ఈ సందర్భంగా తెలిపారు.
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్యం నుండి వాతావరణాన్ని కాపాడుకునేందుకు కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తుందని,మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా సేవలు అందించి ఆర్థికంగా ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పి నరసింహ,ఎమ్మెల్యే లు నలమాద పద్మావతి రెడ్డి, మందుల సామెల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న యాదవ్ సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేనా రెడ్డి వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, ఎక్సక్యూటివ్ డైరెక్టర్లు ఉపేష ఖాన్,వెంకన్న, జేబీఎం సంస్థ ప్రతినిధి ప్రభాకర్, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.











