Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయం

Komatireddy Venkatreddy : రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

Komatireddy Venkatreddy : రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

కనగల్, మనసాక్షి :

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు – భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం కోమటిరెడ్డి నల్లగొండ జిల్లా, కనగల్ మండలం జి.యడవల్లి గ్రామ చెరువుకు సుమారు రూ. 1.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న చెరువు అలుగు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా రైతాంగం ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, రిజర్వాయర్లను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి తెలిపారు. జి.యడవల్లి చెరువు తూము, ఇతర పనుల మరమ్మతుకు గాను రూ. కోటి పైచిలుకు నిధులను డీఎంఎఫ్టీ ద్వారా మంజూరు చేయడమే కాకుండా, త్వరితగతిన పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

రూ. 4 వేల కోట్ల వ్యయంతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు చేపట్టడం జరిగిందని, అయితే అటువైపునుండి సొరంగం కూలిపోవడం వల్ల పనులు ఆగిపోయినప్పటికీ తిరిగి పనులను ప్రారంభించి 3 సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తామని చెప్పారు.

జి.యడవల్లి గ్రామంలో రూ. 4.1 కోట్ల వ్యయంతో 84 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. దీనితోపాటు, 5 కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు, రూ. 30 లక్షలతో డ్రైనేజీ మంజూరు చేశామని తెలిపారు. జి.యడవల్లి చెరువు మరమ్మతు పనులను నాణ్యతగా చేపట్టాలని, నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

కనగల్ ఆస్పత్రిలో గ్లూకోమా కంటి పరీక్షలకై అధునాతన యంత్రం ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా ఆస్పత్రి మాదిరిగా కనగల్ ఆసుపత్రిని తీర్చిదిద్దడం జరిగిందని వెల్లడించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కోటీశ్వరులు తినే సన్నబియ్యం రేషన్ ద్వారా పేదలకు అందిస్తున్నట్లు తెలిపారు. కనగల్ మండల మహిళా సమాఖ్య సభ్యులకు అయిటిపాములలో లాగే సోలార్ విద్యుత్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏవైనా సమస్యలు ఉంటే మండల ప్రజలు తన దృష్టికి రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఉదయసముద్రం, బ్రాహ్మణవెల్లేముల తదితర ప్రాజెక్టుల ద్వారా నీరు వృథా కాకుండా ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్‌తో పాటు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి నీటి సద్వినియోగానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా ఎడవల్లి చెరువు తూము గండి వల్ల నీరు వృథా అవుతున్నదని తెలుసుకొని ఆ చెరువు పనుల మరమ్మతుకు మంత్రి ఆదేశాలతో నిధులు మంజూరు చేయడం జరిగిందని, వచ్చే వానకాలం నాటికి మరమ్మతులను పూర్తి చేసి రైతులకు చెరువు నుంచి పూర్తి స్థాయిలో నీరు పొందే విధంగా చర్యలు తీసుకుంటామని, అధికారులు నిర్దేశించిన సమయంలో నాణ్యతతో పనులు పూర్తి చేయాలన్నారు.

అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి మాట్లాడుతూ జి.యడవల్లి చెరువు గండిని పూడ్చేందుకు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయడం పట్ల మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దొరేపల్లి వరకు నిర్మిస్తున్న రోడ్డులో భాగంగా మిగిలిపోయిన పనులను, అలాగే లక్ష్మీదేవిగూడెం వరకు నిర్మించే రోడ్డు బ్యాలెన్స్ పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెహ్రూ, నల్గొండ ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, తహసిల్దార్ పద్మ, ఇంజినీరింగ్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : వ్యవసాయ అధికారుల ఫోన్ నెంబర్లు మార్పు.. ఇవీ నెంబర్లు..!

  2. Nalgonda : అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాల అడ్మిషన్ రూమ్ సీజ్..!

  3. Nalgonda : ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస చోరీలు.. రోగుల బెంబేలు.. రంగంలో దిగిన పోలీసులు..!

  4. Big Alert : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా.. రేపే చివరి తేదీ..!

  5. Aadabidda Nidhi : ప్రతి మహిళకు నెలకు రూ.1500.. డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలోకి.. వెంటనే దరఖాస్తు చేయండి..!

మరిన్ని వార్తలు